ఎంపీ అవినాశ్ తల్లి ఆరోగ్యంపై డాక్టర్ల కీలక ప్రకటన - సీబీఐ విచారణ వేళ..!!
కడప ఎంపీ అవినాశ్ రెడ్డి తల్లి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ప్రకటన చేసారు. అవినాశ్ తల్లి శ్రీలక్ష్మి ప్రస్తుతం కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం అవినాశ్ సీబీఐ విచారణ కు హాజరయ్యేందుకు సిద్దవుతున్న సమయంలో తల్లి అనారోగ్యం పైన సమాచారం అందింది. దీంతో వెంటనే తన న్యాయవాదుల ద్వారా సీబీఐకి సమాచారం ఇచ్చి తాను తల్లి వద్దకు వెళ్లారు. 22న విచారణకు రావాలని సీబీఐ మరోసారి నోటీసులు ఇచ్చింది. అవినాశ్ తల్లి ఆరోగ్యం కొంత ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
అవినాశ్ తల్లికి చికిత్స: ఎంపీ అవినాశ్ తల్లికి కర్నూలు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్న వివరాలను వైద్యులు వెల్లడించారు. అవినాశ్ తల్లి శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్థితి కొంత ఆందోళనకరంగానే ఉందని ఆస్పత్రిలోని గుండె వైద్య నిపుణులు డాక్టర్ హితేష్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నిర్వహించిన పరీక్షలో ట్రోపోనిన్ పాజిటివ్ వచ్చిందని చెప్పారు. అది గుండె పోటు వచ్చే అవకాశాన్ని సూచిస్తోందన్నారు. యాంజియోగ్రామ్ నిర్వహించగా అమెకు రెండు నరాల్లో బ్లాక్స్ ఉన్నట్లు గుర్తించామన్నారు. రక్తపోటు తక్కువగా ఉందని..అది సాధారణ స్థితికి వచ్చిన తరువాతనే ఎలాంటి వైద్యం అందిచాలన్న అంశం పై నిర్ణయం తీసుకుంటామని డాక్టర్ వెల్లడించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స కొనసాగుతోందన్నారు.

కొంత ఆందోళనకరంగా: అవినాశ్ తల్లిని మరి కొన్ని రోజుల పాటుగా అక్కడే ఉంచి చికిత్స అందించాల్సిన అవసరం ఉంటుందని వైద్యులు చెప్పారు. ఆస్పత్రిలో నాలుగో అంతస్థులోని ఐసీయూలో తన తల్లికి చికిత్స అందిస్తుండగా, అయిదో అంతస్తులోనే ఉంటూ అవినాశ్ వైద్యులతో సంప్రదింపులు జరుపుతున్నారు. తన తల్లి అస్వస్థతకు గురి అయిన కారణంగానే శుక్రవారం తాను విచారణకు హాజరు కావటం లేదని తన న్యాయవాదుల ద్వారా సీబీఐకి అవినాశ్ సమాచారం పంపారు. ఇప్పుడు ఎంపీ అవినాశ్ తల్లి ఆరోగ్య పరిస్థితి కొంత ఆందోళన కరమని చెబుతున్న వేళ సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు రావాలని అందులో స్పష్టం చేసింది.
సీబీఐ నోటీసులతో: ఇటు తల్లి ఆరోగ్య పరిస్థితి కొంత ఆందోళనకరమని వైద్యులు చెబుతున్నారు. ఇదే టైంలో సీబీఐ విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేసింది. ఇదే సమయంలో బెయిల్ పిటీషన్ పైన విచారణకు ఆదేశాలు ఇవ్వాలంటూ అవినాశ్ తరపు న్యాయవాదులు మరోసారి న్యాయస్థానం ఆశ్రయించేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పటికే సుప్రీంలో ఈ మేరకు అభ్యర్దన చేసినా..విచారణ పైన నిర్ణయం వెలువడలేదు. ఈ పరిస్థితుల్లో సోమవారం అవినాశ్ సీబీఐ సూచించినట్లుగా విచారణకు హాజరవుతారా..లేక, తల్లి ఆరోగ్యం కొంత ఆందోళనకరంగా ఉండటంతో సమయం కోరుతారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. అదే జరిగితే సీబీఐ నిర్ణయం ఏంటనేది ఉత్కంఠను పెంచుతోంది.












Click it and Unblock the Notifications