జగన్ హోదా తెస్తే రిజైన్ చేస్తా, సిఎంతోను రాదు: జెసి బాంబు, ఔను.. బాబు ఔట్ డేటెడ్ కానీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంపై అనంతపురం పార్లమెంటు సభ్యుడు, టిడిపి సీనియర్ నేత జెసి దివాకర్ రెడ్డి మంగళవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన శాసన సభ లాబీల్లో విలేకరులతో మాట్లాడారు.
బీహార్ రాష్ట్రం కంటే ఏపీకి ఎక్కువ నిధులు కేంద్రం నుంచి వస్తాయని ఆయన చెప్పారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా తెస్తానంటే నేను రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని జెసి సవాల్ చేశారు.
ముఖ్యమంత్రి, మంత్రులు మొత్తం రాజీనామా చేసినా ఇప్పుడు ప్రత్యేక హోదా రాదని జెసి కుండబద్దలు కొట్టారు. ప్రత్యేక హోదా కోసం తనతో పాటు పదిమంది ఎంపీలు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
కాగా, ఇప్పుడైతే ఏపీకి రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే ప్రసక్తే లేదని జేసీ అభిప్రాయపడ్డారు. హోదా రాదు గానీ, ఓ మంచి ప్యాకేజీ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. హోదా గురించి చర్చలు, రాజీనామాలు చేయాలన్న డిమాండ్లు మరచి, అభివృద్ధి దిశగా ముందుకు సాగేందుకు కృషి చేయాలన్నారు.

చదువుకున్న వారు ఆలోచించాలి
ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యలు వద్దని జెసి విజ్ఞప్తి చేశారు. చదువుకున్న వారు హోదా, ప్యాకేజీ విషయమై ఆలోచించాలన్నారు. హోదా ఇవ్వకపోయినా అంతకంటే ఎక్కువ ఇస్తామని కేంద్రం చెబుతుంటే దానిని అంగీకరించాలన్నారు. చదువుకున్న వారు హోదా అనే పదానికి ప్రాముఖ్యత ఇవ్వవద్దన్నారు.
అందువల్లే ఈ తరం వాడు కాలేకపోయాడు
చంద్రబాబు తెలివైన వారని, పరిపాలన అనుభవం ఎంతో ఉందని చెప్పారు. కోపం, తాపం లేకపోవడం వల్లే చంద్రబాబు ఈ తరంవాడు కాలేకపోయారని జగన్ వ్యాఖ్యలను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. చంద్రబాబుతో పోల్చుకునే స్థాయి జగన్‌కు లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే రఘువీరా పార్టీ అన్నారు.
జగన్ చెప్పినట్టుగా చంద్రబాబు ఔట్ డేటెడ్ సీఎంలానే కనిపిస్తున్నారని జేసీ అన్నారు. అయితే, చంద్రబాబుకు కోపం, ఆవేశం తక్కువని, ఆ విషయంలో చంద్రబాబుతో పోలిస్తే జగన్ ఎంతో ముందు నిలిచాడని ఎద్దేవా చేశారు. జగన్ తమవాడేనని అన్నారు. రాజకీయాల్లో ఆయన మరింతగా రాటుదేలాల్సి ఉందన్నారు.
శాసన సభలో జగన్ పైన అచ్చెన్నాయుడు ఆగ్రహం
శాసన సభలో వైసీపీ నేతలు చేస్తున్న ఆందోళనపై ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత మాట్లాడితేనే వైసీపీ సభ్యులు కూర్చుంటున్నారని, అధికారపక్ష సభ్యులు మాట్లాడితే వైసీపీ సభ్యులు గొడవ చేస్తున్నారన్నారు.
జగన్ ప్రసంగంలో ఒక్క కొత్త విషయం కూడా లేదన్నారు. రోజూ పేపర్లలో వచ్చేవే వున్నాయన్నారు. ఓటుకు నోటు కేసు పెద్ద గూడుపుఠాణి అన్నారు. మే 21న హరీశ్ రావును జగన్ కలిశారని, స్టీపెన్ సన్‌కు ఎమ్మెల్యే పదవి ఇప్పించింది కూడా జగనేనన్నారు.
హరీశ్ రావుతో జగన్ భేటీలో స్టీఫెన్‌సన్ కూడా ఉన్నారని తెలిపారు. వారిద్దరూ కలసిన ఆధారాలు తన వద్ద ఉన్నాయన్నారు. ఇంతకీ జగన్ ఏపీ నేతా?... తెలంగాణ నేతా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వంతో చేతులు కలిపి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టారని విమర్శించారు. 1200 మంది విద్యుత్ కార్మికుల ఉద్యోగాలను తెలంగాణ ప్రభుత్వం తొలగిస్తే ప్రతిపక్ష నేత కనీసం స్పందించలేదన్నారు.












Click it and Unblock the Notifications