ఏపీలోని 25 జిల్లాల్లో ఆ పని చేయడమే మా లక్ష్యం - ఎంపీ కేశినేని చిన్ని
రాష్ట్ర వ్యాప్తంగా క్రికెట్‌కు మరింత బలాన్నిచ్చే దిశగా.. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) కృషి చేస్తోందని అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ఈ మేరకు విజయవాడలో నిర్వహించిన ఏసీఏ 72వ వార్షిక సర్వసభ్య సమావేశం అనంతరం ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్రంలోని 25 జిల్లాల్లో ఆధునిక క్రికెట్ మైదానాల నిర్మాణం లక్ష్యంగా ప్రణాళిక రూపొందించామని తెలిపారు. రానున్న రెండేళ్లలో ప్రతి జిల్లాలో ఏసీఏకి సొంత మైదానం ఉండేలా చర్యలు చేపట్టామని వెల్లడించారు.
అంతే కాకుండా ప్రతిభావంతులైన యువ క్రికెటర్లను గుర్తించేందుకు ఆంధ్రప్రదేశ్ లీగ్ (ఏపీఎల్) నిర్వహించనున్నట్టు కేశినేని చిన్ని చెప్పారు. విశాఖపట్నం స్టేడియాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు తగినట్టుగా మరింత అభివృద్ధి చేసి.. ఇంకా ఎక్కువ మ్యాచ్‌ల నిర్వహణకు అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. మరిన్ని ఫ్రాంఛైజీలను ఆకర్షించేందుకు మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామని వివరించారు. అన్ని జిల్లా క్రికెట్ సంఘాలు ఏడాదికి కనీసం 200 రోజుల పాటు మ్యాచ్‌లు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించామని స్పష్టం చేశారు.

క్రీడా నగరంలో అంతర్జాతీయ స్టేడియం..
మరోవైపు రాష్ట్ర రాజధాని పరిధిలో క్రీడా నగరాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. వాటిలో అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియం కూడా ఉండబోతుందని తెలిపారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేశ్, ఏసీఏ కార్యదర్శి సానా సతీష్ సహాయంతో ఐసీసీ ఛైర్మన్ జై షా, బీసీసీఐతో ప్రాథమిక చర్చలు జరిగినట్టు పేర్కొన్నారు.
మహిళా ప్రపంచకప్ వేదిక..
అలానే ఏసీఏ కార్యదర్శి సానా సతీష్ మాట్లాడుతూ.. తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మహిళా వన్డే వరల్డ్ కప్ క్రికెట్ పోటీలకు వేదిక కావడం గర్వకారణమన్నారు. సెప్టెంబర్, అక్టోబర్‌లో విశాఖపట్నంలో ఈ మ్యాచ్‌లు జరగనున్నట్లు చెప్పారు. ఇది రాష్ట్ర క్రీడాభివృద్ధికి ఎంతో ప్రోత్సాహకరమని అభిప్రాయపడ్డారు.
జిల్లా క్రికెట్ సంఘాలకు సంవత్సరానికి ఇచ్చే నిధులను రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షలకు పెంచామని సతీష్ తెలిపారు. కాగా అనుబంధ క్రికెట్ క్లబ్‌లు స్వయంగా ప్రాంతీయ పోటీలు నిర్వహించాలి అనే ప్రతిపాదనను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఏసీఏ ఉపాధ్యక్షుడు పి. వెంకట రమా ప్రశాంత్ సహా పలువురు మహిళా ప్రతినిధి ఎన్. గీత, మాజీ క్రికెటర్ ఎంఎస్‌కే ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications