'షిరిడి సాయి' ఎలక్ట్రికల్ కంపెనీ వెనక ఉన్నదెవరు??
ఏపీలో 'షిరిడిసాయి' ఎలక్ట్రికల్ కంపెనీ వేలకోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతోందని, ఆ కంపెనీ వెనక ఉన్న అదృశ్య శక్తి ఎవరని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. అంత పెట్టుబడులు పెట్టే సామర్థ్యం ఆ కంపెనీకి ఉందా? అన్నారు. ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్ జిల్లా పైడిపాలెం దగ్గర శిరిడి సాయి కంపెనీ 7,200 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తోందని వెల్లడించారు. ఆ కంపెనీ దీనికోసం రూ.32వేల కోట్ల పెట్టుబడిని పెడుతోందని, 'ఇండో సోల్' పేరుతో ఒక సంస్థ ఏర్పాటు చేసిందన్నారు.
అలాగే నెల్లూరు జిల్లా రామాయపట్నం దగ్గర 5147 ఎకరాల్లో పాలిసెలికాన్, ఫ్లోట్ రోల్డ్ గ్లాసెస్ తయారు చేయడానికి రూ.43,143 కోట్ల పెట్టబడులు పెడుతోందన్నారు. షిరిడిసాయి కంపెనీకి రూ.76వేల కోట్లతో రెండు ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు బ్యాంకులు రుణాలిచ్చినా రూ.22వేల కోట్లు ప్రమోటర్లు పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుందన్నారు. ఇవి పూర్తికావడానికి విదేశీ పెట్టుబడులు వస్తాయంటున్నారని, పెట్టుబడులు పెట్టేది సూట్ కేస్ కంపెనీలా? అనే సందేహాన్ని రఘురామ వ్యక్తం చేశారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో ఏ5గా ఆరోపణలు ఎదుర్కొంటున్న శివశంకర్ రెడ్డి వియ్యంకుడైన పద్మా జనార్ధన్ రెడ్డిని ప్రభుత్వం సెంట్రల్ డిస్కం చైర్మన్ గా నియమించిందని, ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాతే షిరిడి సాయి కంపెనీకి యథేచ్ఛగా ఆర్డర్లు ఇచ్చారని రఘురామ వెల్లడించారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున నరసాపురం నుంచి ఎంపీగా ఎంపికైన రఘురామకృష్ణరాజు రాష్ట్ర ప్రభుత్వంతో విభేదించి రెబల్ ఎంపీగా పేరుతెచ్చుకున్నారు. రానున్న ఎన్నికల్లో ఆయన వేరే ఇతర పార్టీ నుంచి ఎంపీగా పోటీచేస్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. నిత్యం జగన్ ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణల్లో భాగంగా ఆయన తాజాగా షిరిడిసాయి కంపెనీ గురించి ప్రస్తావించారు.












Click it and Unblock the Notifications