కబళిస్తోన్న ఎబోలా: డబ్ల్యూహెచ్ఓ చీఫ్ మకాం.. !!
ప్రపంచానికి మరో వైరస్ ప్రమాదం పొంచివుంది. కరోనా తరహా ప్రాణాంతక మహమ్మారి ఇది. ఇప్పటికే రెండు దేశాల్లో కోరలు చాచింది కూడా. పలు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయక్కడ. దీని బారిన పడిన ప్రజలు ప్రాణాలు సైతం కోల్పోతోన్నారు. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ రంగంలోకి దిగింది. ఈ వైరస్ ను మహమ్మారిగా ప్రకటించింది. వైరస్ అవుట్ బ్రేక్ అయినట్టు అధికారికంగా నిర్ధారించింది. అదే.. ఎబోలా వైరస్. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, దాని పొరుగున ఉన్న ఉగాండాలో ఎబోలా వైరస్ ప్రబలింది.
కాంగోలో 1,077 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే 246 మంది దీని బారిన పడి మరణించారు. ఉగాండాలో తొమ్మిది కేసులు, ఒక మరణం నమోదైంది. ఎబోలా వైరస్ వ్యాప్తిని నివారించడంలో భాగంగా ఈ రెండు దేశాల్లో మెడికల్ ఎమర్జెన్సీని ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ప్రస్తుత వ్యాప్తికి కారణం బుండిబుగ్యో వైరస్. అరుదైన ఎబోలా రకానికి చెందిన సూక్ష్మ క్రిమి ఇది. దీన్ని అరికట్టడానికి ఎటువంటి చికిత్సలు లేదా టీకాలు ఇప్పటివరకు అందుబాటులో లేవు.

నిజానికి కాంగో, ఉగాండాలకు ఎబోలా వైరస్ కొత్తేమీ కాదు. ఇప్పటివరకు 20 సార్లు ఈ వైరస్ ఆయా దేశాల్లో అవుట్ బ్రేక్ అయింది. ఎబోలాలో అత్యంత ప్రమాదకరం, ప్రాణాంతకమైన బుండిబ్యుగో వైరస్ వ్యాప్తి చెందడం ఆందోళన కలిగిస్తోంది. పెద్ద ఎత్తున మరణాలు సంభవించిన నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ ఘెబ్రేయెసస్ ప్రస్తుతం కాంగోలో పర్యటిస్తోన్నారు. ప్రత్యేకించి ఎబోలా వ్యాప్తికి కేంద్రబిందువు అయిన తూర్పు కాంగో ఇటూరి ప్రావిన్స్ లోని బునియాకు వెళ్లారు.
అక్కడ ఏర్పాటు చేసిన చికిత్సా కేంద్రాల గురించి అడిగి తెలుసుకున్నారు. స్థానిక అధికారులు, ఆరోగ్య కార్యకర్తలు, బాధిత కుటుంబాలను కలుసుకున్నారు. కాంగో ప్రధాని జుడిత్ సుమిన్వాతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మెరుగైన ఆరోగ్య సదుపాయాలు, కొత్త సహాయ నిధులు అందినప్పటికీ, వైరస్ వ్యాప్తి.. అంచనాల కంటే వేగంగా సంభవిస్తోందని తేల్చారు. ఎబోలాను దాని కేంద్రస్థానం.. అంటే మొదట ఎక్కడ వ్యాప్తి చెందిందో అక్కడే దాన్ని ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోన్నామని ఆయన అన్నారు.
సరిహద్దుల మూసివేత, ప్రయాణ నిషేధాలు ఎబోలా వ్యాప్తిని నిరోధించడంలో పెద్దగా ప్రభావం చూపట్లేదని టెడ్రోస్ స్పష్టం చేశారు. ఎబోలా బారిన పడి మరణించిన వారి మృతదేహాలను ఖననం చేయడంలో అత్యంత జాగ్రత్త అవసరమని వ్యాఖ్యానించారు. ఆ సమయంలో ఎటువంటి చిన్న పొరపాటు చోటు చేసుకున్నా వైరస్ వ్యాప్తి చెందుతుందని అన్నారు. ఎబోలాపై పోరాటంలో కాంగో ఒంటరి కాదని, ఈ దేశ ప్రజల వెంట తాము ఉన్నామని ఆయన భరోసా ఇచ్చారు.
ఎబోలా అవుట్ బ్రేక్ అయిన వెంటనే ఇంత తక్కువ సమయంలో ఇన్ని పాజిటివ్ కేసులు గతంలో ఎప్పుడూ నమోదు కాలేదని డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ పేర్కొంది. ప్రస్తుతానికి దీన్ని నియంత్రించడానికి సర్వైవలెన్స్, కాంటాక్ట్ ట్రేసింగ్, ఐసోలేషన్, ఇన్ఫెక్షన్ నివారణ, సురక్షిత అంత్యక్రియల వంటి సాంప్రదాయ పద్ధతులపై ఆధారపడుతున్నామని పేర్కొంది. తూర్పు కాంగోలో మరింత వ్యాప్తి చెందవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది.












Click it and Unblock the Notifications