లోక్‌సభ స్పీకర్ కు లేఖ రాసిన ఎంపీ రఘురామకృష్ణరాజు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి జగన్ ప్రభుత్వాన్ని, సీఐడీని టార్గెట్ చేశారు. కస్టడీలో తనను చిత్రహింసలు పెట్టిన ఐదుగురు పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈమేరకు ఆయన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. గుంటూరు సీఐడీ కార్యాలయంలో ఏపీ సీఐడీ ఏడీజీ పీ.వీ సునీల్ కుమార్, డీఐజీ సునీల్ నాయక్, ఏఎస్పీ విజయ్ పాల్, ఏఎస్సై పసుపులేటి సుబ్బారావు, కానిస్టేబుల్ మల్లేశ్వరరావు తనను చిత్రహింసలకు గురిచేశారని ఆరోపించారు.
ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సూచనలతోనే వారు తనను వేధించారని ఆ లేఖలో పేర్కొన్నారు. పీవీ సునీల్ కుమార్‌పై అనేక అవినీతి ఆరోపణలతో పాటు గృహ హింస కేసు కూడా నమోదైందని తెలిపారు. సునీల్ నాయక్, విజయ్‌పాల్ ఉద్యోగ విరమణ చేసినా రెండు సంవత్సరాల నుంచి ఓఎస్డీలుగా కొనసాగుతున్నారని, సుప్రీంకోర్టు ఉత్తర్వులవల్లే తనను సికింద్రాబాద్ మిలటరీ ఆసుపత్రికి తరలించారని వివరించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారని, అక్కడి నివేదికతోనే కోర్టు బెయిల్ ఇచ్చిందని గుర్తుచేశారు.

ఈ ఘటనపై సభా హక్కుల కమిటీకి ఫిర్యాదు చేశానని, ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని వెల్లడించారు. కమిటీకి ఉన్న అధికారాలతో ఆ ఐదుగుర్ని వెంటనే పిలిపించి విచారణ చేపట్టాలని, వారిపై విచారణను ఆలస్యం చేస్తే పార్లమెంట్‌పై ఉన్న గౌరవం తగ్గిపోతుందన్నారు. ఎంపీ రాసిన లేఖను చర్యల నిమిత్తం స్పీకర్ కేంద్ర హోం శాఖకు పంపారు.
వైసీపీలో రెబల్ ఎంపీగా కొనసాగుతున్న రఘురామ కృష్ణరాజు ప్రస్తుతం ఢిల్లీలోనే ఉంటున్నారు. నియోజకవర్గంలో కూడా పర్యటించడంలేదు. కొన్నాళ్ల క్రితం ప్రధాని మోడీ భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ లో బయలుదేరిన రఘురామరాజు అకస్మాత్తుగా బేగంపేట స్టేషన్ లో దిగిపోయారు. మార్గమధ్యంలో సత్తెనపల్లి వద్ద తనను హత్య చేయడానికి కుట్ర పన్నారని, అందుకే తన నియోజకవర్గ పర్యటనకు వెళ్లడంలేదని ప్రకటించారు.












Click it and Unblock the Notifications