బీజేపీతో టీడీపీ పొత్తు - ఆ పార్టీతోనూ టచ్ లో చంద్రబాబు..!!
వచ్చే ఎన్నికల్లో వైసీపీ తిరిగి అధికారంలోకి రావటం ఖాయమని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయ సాయిరెడ్డి ధీమా వ్యక్తం చేసారు. క్షేత్ర స్థాయిలో పార్టీకి పూర్తి బలం ఉందన్నారు. 151 స్థానాలకు ఒక్క సీటు తగ్గకుండా ఇంకా ఎక్కువ వస్తాయని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఎన్ని అబద్దాలు చెప్పినా ప్రజలంతా సీఎం వైయస్ జగన్ వెంటే ఉన్నారనడంలో సందేహమే లేదని పేర్కొన్నారు. ఇదే సమయంలో పొత్తుల దిశగా చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలను వివరించారు.
పొత్తుల కోసం వెంపర్లాట: వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారని సాయిరెడ్డి చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఎన్ని రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకున్నా వైసీపీ ఒంటరిగా పోటీ చేసి గతంలో కంటే అధికంగా స్థానాలను చేజిక్కించుకుంటుందని చెప్పారు.

వారు ఊహిస్తున్నట్లుగా టీడీపీ, బీజేపీలు గ్రాండ్ అలయన్స్‌గా ఏర్పడ్డా అందరికీ గుణపాఠం నేర్పుతామన్నారు. ఒక్క బీజేపీతోనే కాదు.. మిగతా రాజకీయ పార్టీలతో కూడా పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారని కీలక వ్యాఖ్యలు చేసారు. కొన్ని ప్రాంతీయ పార్టీలతో స్నేహం కోసం అర్రులు చాస్తున్నారని సాయిరెడ్డి వివరించారు.
2024లో చంద్రబాబు ఓటమి ఖాయం: ఏపీలో ఈ రోజుకు కూడా చంద్రబాబుకు ఒక స్థిర నివాసం లేదని సాయిరెడ్డి ఎద్దేవా చేసారు. తెలంగాణలోనూ నివాసం ఉంటున్నారని చెప్పుకొచ్చారు. సామాజిక న్యాయం అంటూ ఊదరగొట్టే చంద్రబాబు ప్రతి విషయంలో కులం, మతం చూస్తారని విమర్శించారు. మీడియా, సోషల్ మీడియాను మేనేజ్ చేసుకుంటూ తాను ఒక విజనరీ అని చిత్రీకరించుకుంటున్నారని చెప్పుకొచ్చారు.
విజన్ 2020 అన్నారని...అది అయిపోయింది..ఇప్పుడు విజన్ 2047 అంటున్నారని ఎద్దేవా చేసారు. 2047 నాటికి చంద్రబాబు ఏ పరిస్థితుల్లో ఉంటాడో ఊహించుకోవాలని సూచించారు. ప్రజల్ని నమ్మించి మోసం చేసేందుకు ఇలాంటి విజన్ డాక్యుమెంట్లు విడుదల చేస్తుంటారన్నారు. 2024లో చంద్రబాబు కథ ముగుస్తుందని పేర్కొన్నారు.

వైసీపీదే మరోసారి అధికారం: తాజా టైమ్స్ నౌ, ఇండియా టుడేల సర్వేలను చూస్తే వైసీపీ ప్రభంజనం స్పష్టంగా కనిపిస్తోందని సాయిరెడ్డి చెప్పుకొచ్చారు. ఆ తర్వాత చంద్రబాబు రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిందేనని జోస్యం చెప్పారు. 2024 తర్వాత తెలుగుదేశం పార్టీ అంతర్ధానం అవుతుందన్నారు.
కొత్త రాజకీయ పార్టీలు పుట్టుకొస్తాయన్నారు. ఇక లోకేశ్‌కి కూడా భవిష్యత్తు లేదన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక సీట్లతో వైసీపీ అధికారాన్ని కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేసారు. ప్రజల సమస్యలన్నిటినీ పరిష్కరించామని, జగనన్న సురక్ష ద్వారా మిగిలిపోయినవి కూడా పరిష్కరిస్తున్నామని వివరించారు.












Click it and Unblock the Notifications