నేడు సీబీఐ ఎదుట అవినాశ్ - ఉత్కంఠ, ఏం జరుగుతోంది..!!
కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఈ రోజు (శుక్రవారం) సీబీఐ ఎదుట హాజరు కానున్నారు. నేడు జరిగే విచారణ కీలకం కానుంది. ఇప్పటికే ఈ కేసులో అవినాశ్ ఆరు సార్లు విచారణ ఎదుర్కొన్నారు. ఈ నెల 16వ తేదీన హాజరు కావాలని సీబీఐ నోటీసులు జారీ చేసింది. అయితే, తనకు ముందస్తు షెడ్యూల్‌లో భాగంగా ఇతర కార్యక్రమాలు ఉన్నాయని, నాలుగు రోజులు గడువు కావాలంటూ చివరి నిమిషంలో అవినాశ్ విచారణకు గైర్హాజరయ్యారు. ఈ రోజు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది.
అవినాశ్ విచారణ:వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణలో అనేక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్ పై విచారణను వెకేషన్ బెంచ్ కి ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించినా విచారణ తేదీ ఖరారు కాలేదు. విచారణకు హాజరయ్యేందుకు అవినాశ్ రెడ్డి కడప నుంచి హైదరాబాద్ కు బయల్దేరారు. ఇదే సమయంలో సీబీఐ పిలిచిన ప్రతీసారి అవినాశ్ రెడ్డి కోర్టులో పిటీషన్ వేస్తూ..గడువు కోరుతూ విచారణను జాప్యం చేస్తున్నారని వివేకా కుమార్తె సునీత న్యాయస్థానం కు వివరించారు. అటు సీబీఐ ఎంపీ అవినాశ్ పై కీలక అభియోగాలు నమోదు చేసింది. పులివెందుల నుంచి ఎంపీ అనుచరులు పెద్ద సంఖ్యలో హైదరాబాద్ కు బయల్దేరారు.

సీబీఐ నిర్ణయంపై ఉత్కంఠ:ఈ రోజు జరిగే విచారణకు హాజరు కావాలని సీబీఐ అధికారులు పులివెందులలోని ఆయన ఇంటికివెళ్లి, అక్కడున్న వారికి నోటీసు ప్రతులు అందజేశారు. ఈ నోటీసుల నేపథ్యంలో అవినాశ్ రెడ్డి విచారణకు హాజరవుతారా లేక మరేదైనా కారణం చూపించి సమయం కోరుతారా అనే ఆసక్తి కర చర్చ సాగుతోంది. సీబీఐ ముందుకు విచారణకు వస్తే ఏం జరుగుతుందనే ఉత్కంఠ కనిపిస్తోంది. ఇప్పటికే సీబీఐ అవినాశ్ ను సహ నిందితుడుగా పేర్కొంది. హత్య ఘటనలో ఆధారాల టాంపరింగ్ చేసారని సీబీఐ ఆరోపిస్తోంది. అవినాశ్ పలు కొత్త అంశాలను తెర పైకి తీసుకొచ్చారు. రాజకీయంగా తమ పైన కుట్ర జరుగుతోందని వాదిస్తున్నారు. వివేకా రెండో భార్య వివాదం..ఆస్తుల వ్యవహారాలను ప్రస్తావిస్తున్నారు. అసలు హత్య రోజు లేఖ గురించి తేల్చాలని కోరుతున్నారు.
ఏం జరుగుతోంది:సీబీఐ ఇప్పటికే వివేకా కుమార్తె సునీతతో పాటుగా ఆమె భర్త రాజశేఖర రెడ్డిని సీబీఐ పలు మార్లు విచారణ చేసింది. తాజాగా అవినాశ్ ముఖ్య అనుచరులను సీబీఐ విచారణ చేసింది. అటు అవినాశ్ తండ్రి భాస్కర రెడ్డి, ఉదయ కుమార్ రెడ్డి రిమాండ్ లో ఉన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు జైన్ నెలాఖరులోగా వివేకా హత్య కేసు విచారణ పూర్తి చేయాల్సి ఉంది. దీంతో..అవినాశ్ ముందస్తు బెయిల్ పిటీషన్ విచారణ సమయంలో అవసరమైతే అరెస్ట్ చేస్తామని సీబీఐ స్పష్టం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ రోజు సీబీఐ విచారణకు అవినాశ్ హాజరు..ఏం జరుగుతుందనే ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications