mudragada padmanabha reddy: ఆ ముగ్గురినీ ఇరికించేసిన ముద్రగడ..?
ఏపీలో ఈసారి సార్వత్రిక ఎన్నికలు సవాళ్లకు, ప్రతిసవాళ్లకు కేంద్రంగా మారాయి. వైసీపీ వర్సెస్ విపక్షాలుగా మారిన పోరులో ఎట్టి పరిస్ధితుల్లోనూ తమ పార్టీ గెలుస్తుందని భావించిన జగన్ పార్టీ నేతలు ప్రత్యర్థులపై సవాళ్లతో రెచ్చిపోయారు. చివరికి ఫలితాలు రాగానే ఒక్కొక్కరుగా తోక ముడిచేసారు. అయితే ఇదే క్రమంలో గతంలో తాము చేసిన సవాళ్లపై జనం నిలదీస్తుండే సరికి ఇరుకున పడుతున్నారు. దీంతో ఇలా సవాళ్లు విసిరిన కాపు నేత ముద్రగడ పద్మనాభం తన పేరు మార్చేసుకున్నారు.
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే తన పేరు ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని సవాల్ విసిరి విఫలమైన ముద్రగడ పద్మనాభం చివరికి అన్నంత పనీ చేశారు. పవన్ గెలవగానే మీడియా ముందుకు వచ్చి సవాల్ కు కట్టుబడి తన పేరు మార్పుకు దరఖాస్తు చేసుకున్నట్లు ప్రకటించారు. అన్నట్లుగానే పేరు మార్పుకు దరఖాస్తు చేసుకోవడమే కాదు ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మారిపోయారు. ఈ మేరకు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది.

ఇంత వరకా బాగానే ఉన్నా ముద్రగడ తాను గతంలో చేసిన సవాల్ కు కట్టుబడి పేరు మార్చుకోవడం ఇప్పుడు వైసీపీలో మరో ముగ్గురు సీనియర్ నేతల్ని ఇరకాటంలోకి నెట్టేసింది. ఎందుకంటే వీరు కూడా ముద్రగడ తరహాలోనే తమ ప్రత్యర్థులపై సవాళ్లు విసిరారు. వాటిపై జనం ప్రశ్నిస్తుంటే ఇన్నాళ్లు తప్పుంచుకుని తిరుగుతున్న వారే. ఇప్పుడు ముద్రగడ పేరు మార్పుతో వారంతా మరింత ఇరుకున పడినట్లయింది.
ఇలా సవాళ్లు విసిరిన వైసీపీ నేతల్లో మాజీ మంత్రులు కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ తో పాటు ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కూడా ఉన్నారు. గతంలో టీడీపీ గెలిస్తే చంద్రబాబు చెప్పులు తుడుస్తా అని కొడాలి నాని శపథం చేశారు. అలాగే పల్నాడు జిల్లా నరసరావుపేటలో టీడీపీ గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని అనిల్ యాదవ్ సవాల్ విసిరారు. అలాగే పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం నుంచి టీడీపీ నేత యరపతినేని శ్రీనివాస రావు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని కాసు మహేష్ రెడ్డి సవాల్ చేశారు. అయితే తాజా ఎన్నికల్లో ఈ ముగ్గురు ఓటమి పాలవ్వడం, వీరి ప్రత్యర్థులు గెలవడం జరిగిపోయింది. దీంతో వీరి సవాళ్లపై జనం ప్రశ్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications