నాకంత లేదు: రామ్ గోపాల్ వర్మకు ముద్రగడ, వంగవీటిపై ఉమ ఫైర్
రాజమండ్రి/విజయవాడ: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన పైన ప్రశంసలు కురిపించిన నేపథ్యంలో కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం స్పందించారు. వర్మకు తనపై ఉన్న అభిమానానికి ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు.
ముద్రగడ రాజకీయపార్టీ పెడితే తాను చేరతానన్న వర్మ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై ముద్రగడ స్పందించారు. తాను రాజకీయ పార్టీ పెట్టేంత పెద్దవాడిని కాదన్నారు. వంగవీటి చిత్రం తీసేందుకు తన అనుమతి వర్మకు అవసరం లేదన్నారు. ఏదైనా అభ్యంతరం ఉంటే వంగవీటి రంగా కుటుంబమే చెబుతుందన్నారు. సీఎం చంద్రబాబు తనకు ఇచ్చిన హామీని అమలు చేయాలన్నారు.
కాగా, ఏపీ పర్యటనలో ఉన్న వర్మ మాట్లాడుతూ.. తాను తీయబోయే 'వంగవీటి' సినిమాలో జరిగిన కథనే యథార్థంగా చూపించే ప్రయత్నం చేస్తానన్నారు. ఇందులో ఒకరిని ఎక్కువ మరొకరిని తక్కువ చేసి చూపించనన్నారు. మహాభారతంలోని హింస కంటే విజయవాడలో ఎక్కువ హింస జరిగిందన్నారు.

విజయవాడ ప్రతిష్ట దెబ్బతీయవద్దు: ఉమ
రామ్ గోపాల్ వర్మ తీస్తున్న వంగవీటి చిత్రంపై బొండా ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాభారతంలో జరిగిన హింసకంటే విజయవాడలో జరిగిన హింసే ఎక్కువన్న వర్మ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ప్రస్తుతం అందరూ విజయవాడ అభివృద్ధినే కోరుకుంటున్నారన్నారు. అంతేగానీ విజయవాడ ప్రతిష్టను దెబ్బతీసే సినిమాలు కోరుకోవడం లేదని చెప్పారు. ఈ విషయాన్ని దర్శకుడు వర్మ ముందు గ్రహించాలని హితవు పలికారు.
దేవినేనితో గంటలపాటు భేటీ
రామ్ గోపాల్ వర్మ శనివారం విజయవాడలోని గుణదలలో మాజీమంత్రి దేవినేని నెహ్రూ నివాసానికి శనివారం వచ్చారు. నాడు విజయవాడలో చోటు చేసుకున్న పరిస్థితులపై వర్మ లోతుగా ఆరా తీశారు. రంగా హత్య ఘటనకు ముందు, ఆ తర్వాత విజయవాడలో నెలకొన్న సామాజిక పరిస్థితులను నెహ్రూ నుంచి తెలుసుకున్నారు.
రంగా అనుచరులు, దేవినేని అనుచరుల పేర్లు, కుటుంబ నేపథ్యం లాంటి సమగ్ర వివరాలను సేకరించారు. రంగా హత్య జరిగినప్పుడు తాను కూడా విజయవాడలోనే ఉన్నానని.. కొన్ని సంఘటనలను ప్రత్యక్షంగా చూశానని వర్మ నెహ్రూతో అన్నారు. అంతర్గతంగా జరిగిన కొన్ని ఘటనలను ఆయన నుంచి తెలుసుకున్నారు.
ఉదయం పది గంటలకు నెహ్రూ నివాసానికి వచ్చిన రామ్ గోపాల్ వర్మ మధ్యాహ్నం ఒకటి గంటల వరకు పలు అంశాలపై చర్చించారు. ఇందులో నెహ్రూ కుమారుడు అవినాష్‌తో పాటు, ఆయన ప్రధాన అనుచరుడైన కడియాల బుచ్చిబాబులు కూడా ఉన్నారు.
వర్మతో భేటీ అనంతరం నెహ్రూ మీడియాతో మాట్లాడుతూ ఒకనాడు జరిగిన చిన్న తప్పిదం వల్ల విజయవాడలో రెండు కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయన్నారు. మూడు దశాబ్దాల తర్వాత ఎవరి జీవితాల్లో వారు స్థిరపడ్డారని, బెజవాడ ప్రస్తుతం చాలా ప్రశాంతంగా ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పాత కక్షల్ని తవ్వి దాని ఆధారంగా సినిమా తీయటం అంటే.. సినిమా వాళ్లు డబ్బు కోసం దేన్నయినా పెద్దగా చూపిస్తారని అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications