రాజకీయాల నుంచి తప్పుకుంటా, మరి నువ్వు: వైయస్ జగన్‌కు మురళీ మోహన్ గట్టి కౌంటర్
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలపై తెలుగుదేశం పార్టీ రాజమహేంద్రవరం ఎంపీ మురళీ మోహన్ తీవ్రంగా స్పందించారు.
మంగళవారం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో బహిరంగ సభలో మాట్లాడిన జగన్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు. అలాగే, ఎంపీ మురళీ మోహన్, గోరంట్ల బుచ్చయ్య చౌదరిలు సీఎం చంద్రబాబు, నారా లోకేశ్‌కు డబ్బు ఇచ్చి ఇసుక దోపిడీ చేస్తున్నారని జగన్ ఆరోపించారు.

ఈ విషయంపై మురళీ మోహన్ స్పందించారు. తాను తప్పు చేసినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. ఒకవేళ నిరూపించకలేకపోతే జగన్ కూడా రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని ప్రశ్నించారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జగన్ లక్షల కోట్లు ఎలా సంపాదించారో చెప్పాలన్నారు. ఒకవేళ జగన్ ముఖ్యమంత్రి అయితే ఏపీనే అమ్మేస్తారన్నారు.
కాంగ్రెస్ పార్టీలో జగన్‌ను అవినీతిపరుడని విమర్శించిన వైసీపీ నేత బొత్స సత్యనారాయణకు ఇప్పుడు ఆయనే దేవుడిలా కనిపిస్తున్నారా అని టీడీపీ నేత వర్ల రామయ్య వేరుగా ప్రశ్నించారు. రోజుకో మాట మార్చే బొత్సకు చంద్రబాబును విమర్శించే అర్హత లేదన్నారు. బొత్స అవినీతి వల్లే ఫోక్స్ వ్యాగన్ కంపెనీ ఉత్తరాంధ్రకు రాకుండా పోయిందన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా కనుసన్నల్లోనే వైసీపీ నడుస్తోందన్నారు.












Click it and Unblock the Notifications