‘తెలుగు రాష్ట్రాల సమస్య కాదు: వ్యక్తుల సమస్యే’
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు మైసూరా రెడ్డి, పార్థసారథిలు మండిపడ్డారు. ఓటుకు నోటు వ్యవహారంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్‌తో చంద్రబాబునాయుడు జరిపిన ఫోన్ సంభాషణలు బహిర్గతమైన ఆడియో టేపులు తమ నేతవి కావని టిడిపి నేతలు చెప్పడం సిగ్గుచేటని అన్నారు.
ఈ వ్యవహారం నుంచి చంద్రబాబు బయటపడటానికి యత్నిస్తూ ఎదురుదాడికి దిగడం దారుణమని అన్నారు. ఈ అంశాన్ని రాష్ట్రాల మధ్య సమస్యగా అంటగట్టాలని చూస్తున్నారని విమర్శించారు. ఇది ఎంతమాత్రం రాష్ట్రాల మధ్య సమస్య కాదని, వ్యక్తుల మధ్య సమస్య మాత్రమేనని స్పష్టం చేశారు.

సమస్యను పక్కదారి పట్టించేందుకే రకరకాల విన్యాసాలు చేస్తున్నారని మండిపడ్డారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ చంద్రబాబు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో చంద్రబాబు నిర్ధోషి అయితే విచారణ జరిపించుకుని నిరూపించుకోవాలని అన్నారు. చంద్రబాబు రాజీనామా కోరుతూ మంగళవారం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ధర్నాలు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇది ఇలా ఉండగా, ప్రకాశం జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపి వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు రాజీనామాకు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించిన చంద్రబాబు, నేరం ఒప్పుకోకుండా ఈ వ్యవహారాన్ని ఏపి, తెలంగాణ ప్రజల మధ్య విభేదాలుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications