టీటీడీ ఛైర్మన్ రేసులో నాగబాబు, అశ్వినీదత్ తదితరులు.. చంద్రబాబు మొగ్గు ఎవరివైపంటే!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలుపు తీరుతున్న వేళ ఏపీలోన అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే టిటిడి చైర్మన్ పదవి పైన చర్చ జరుగుతుంది. టీటీడీ చైర్మన్ పదవి ఎవరిని వరిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవికి కరుణాకర్ రెడ్డి రాజీనామా చేయడంతో, ఈ పదవి కోసం చంద్రబాబు పలువురి పేర్లను పరిశీలిస్తున్నట్లుగా విశ్వసనీయమైన సమాచారం.
టీటీడీ చైర్మన్ గా అశ్వనీదత్ పేరు
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవికి ప్రముఖ నిర్మాత, వైజయంతి మూవీస్ అధినేత అశ్వినీ దత్ ను ఎంపిక చేస్తారని ప్రధానంగా ఏపీలో చర్చ జరుగుతుంది. అశ్వనీ దత్ తో చంద్రబాబుకు ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఆయనకు అవకాశం ఇవ్వొచ్చు అంటున్నారు. చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు, జైలుకు వెళ్లి కలిసిన అశ్వినీదత్ కష్ట సమయంలోనూ చంద్రబాబుకు మద్దతుగా ఉన్నారు.

చంద్రబాబుకు మద్దతుగా అశ్వనీదత్
ఈసారి టీడీపీ 160 స్థానాలు దక్కించుకుంటుందని మీడియాతో అన్నారు. ఆయన చెప్పిన మాట ప్రకారం కూటమి 164 స్థానాలు దక్కించుకుంది. ఎన్నికల సమయంలో బాబుకు మద్దతుగా ఒక వీడియో కూడా అశ్వినీ రిలీజ్ చేశాడు. దీంతో ఆయనకు చంద్రబాబు అవకాశం ఇస్తారేమో అని చర్చ జరుగుతుంది.
టీటీడీ చైర్మన్ గా నాగబాబు పేరు
అంతేకాదు జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగబాబు ఎన్నికల సమయంలో సీట్ల సర్దుబాటు నేపథ్యంలో, తాను పోటీ చేయకుండా తప్పుకున్నారు. కూటమి విజయం కోసం కీలకంగా పని చేశారు. ఈ క్రమంలో నాగబాబుకు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా అవకాశం ఇవ్వడం పైన చంద్రబాబు పరిశీలిస్తున్నట్లుగా సమాచారం.
ఓ టీవీ ఛానల్ యజమాని పేరు టీటీడీ రేసులో
ఇదే సమయంలో ఓ టీవీ ఛానల్ అధినేతకు టిటిడి చైర్మన్ గా అవకాశం పైన చంద్రబాబు ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలిచిన ఆ టీవీ ఛానల్ అధినేతకు తొలి విడతగా రెండు సంవత్సరాలపాటు టీటీడీ చైర్మన్ పదవిని ఇవ్వనున్నట్టు తెలుగుదేశం పార్టీ వర్గాలలో చర్చ జరుగుతోంది. ఇక బిజెపి నుంచి గెలిచిన ఒక ఎంపీ పేరు కూడా టిటిడి చైర్మన్ రేసులో ఉన్నట్టుగా తెలుస్తోంది.
టీటీడీ చైర్మన్ పదవిపై చంద్రబాబు కసరత్తు
ఏది ఏమైనా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవుతున్న వేళ నామినేటెడ్ పదవుల పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇందులో ప్రధానంగా టిటిడి చైర్మన్ పదవి కోసం ఎవరిని ఎంపిక చేయాలి అన్న దానిపైన చంద్రబాబు పెద్ద కసరత్తే చేస్తున్నట్టు సమాచారం. ఈ బోర్డులో సభ్యులుగా నియామకం కోసం కూడా ఇప్పటికే మొదలుపెట్టారు టీడీపీ కూటమి పార్టీల నేతలు.












Click it and Unblock the Notifications