MPగా నాగబాబు పోటీ.. నియోజకవర్గం ఖరారు?
జనసేన పార్టీకి ప్రధాన కార్యదర్శిగా నాగబాబు నియమితులైన సంగతి తెలిసిందే. తాను కేవలం జనసైనికుడినని, పార్టీ బలోపేతం కోసం రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి జనసైనికులను కలుస్తానని, వారు కూడా తనను ఎప్పుడు కావాలంటే అప్పుడు కలవచ్చన్నారు. పవన్ కల్యాణ్ నిజాయితీ, త్యాగ నిరతిని ప్రజలందరికీ వివరిస్తామని, రాష్ట్రంలో మంచి పరిపాలన జనసేన ద్వారా సాధ్యపడుతుందనే విషయాన్ని చెబుతామని నాగబాబు అంటున్నారు.
అనకాపల్లి నుంచి : అనకాపల్లి నియోజకవర్గం నుంచి నాగబాబు ఎంపీగా పోటీచేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని జనసైనికులు చెబుతున్నారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరఫున అల్లు అరవింద్ ఇక్కడి నుంచి పోటీచేసి ఓటమిపాలయ్యారు. కాపు సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉండటం, వారి మద్దతు పూర్తిగా లభిస్తుందనే భరోసాతో ఇక్కడి నుంచి నాగబాబును ఎంపీగా బరిలోకి దింపాలనే యోచనలో పవన్ కల్యాణ్ ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ తరఫున తాను, నాదెండ్ల మనోహర్ రాష్ట్రంలో ఉంటామని, ఢిల్లీలో జనసేన వ్యవహారాలు చక్కబెట్టడానికి నాగబాబు సరైన వ్యక్తి అవుతారనేది జనసేనాని యోచనగా ఉందంటున్నారు.

ఈ 7 జిల్లాల్లోనే : ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలతోపాటు, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని నియోజకవర్గాలనే ఎంచుకోవాలని జనసేన భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్లడం దాదాపుగా ఖాయం కావడంతో ఈ ఏడు జిల్లాల్లోనే మెజారిటి సీట్లను తీసుకోవాలని, అలాగే ఎంపీ స్థానాలను కూడా ఈ ఏడు జిల్లాల్లోనే నాలుగు తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ కూడా ఉభయ గోదావరి జిల్లాల నుంచే ఈసారి పోటీకి దిగుతారని వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే నాగబాబును అనకాపల్లి నుంచి బరిలోకి దింపాలని భావిస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications