బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
విజయవాడ: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గానికి చెందిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, సిద్ధార్థనాథ్ సింగ్, అరుణ్ సింగ్ సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. అనపర్తి నుంచి బీజేపీ అభ్యర్థిగా రామకృష్ణా రెడ్డి పోటీ చేయనున్నారు.
టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా అనపర్తి సీటు బీజేపీకి కేటాయించారు. ఈ క్రమంలో తనకు టికెట్ కేటాయించాలని రామకృష్ణారెడ్డి పట్టుబట్టారు. దీంతో ఈ స్థానంపై ఉత్కంఠ కొనసాగింది. అనపర్తి స్థానం బదులుగా అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లి లేదా ఏలూరు జిల్లాలోని దెందులూరు సీటును బీజేపీ తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరిగింది.

అయితే, సమీకరణలు కుదరకపోవడంతో చివరకు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీలో చేరి ఆ పార్టీ టికెట్ పై అనపర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ.. బీజేపీ తరపున అనపర్తి అభ్యర్థిగా రామకృష్ణారెడ్డి పోటీ చేస్తారని చెప్పారు. అభ్యర్థులు మారినప్పుడు కొంత మనస్తాపం ఉంటుందన్నారు. ఇద్దరు కార్యకర్తలనూ సమన్వయం చేసుకుంటూ నడవాలన్నారు. వారి గౌరవాన్ని పార్టీ దృష్టిలో పెట్టుకుందన్నారు.
అనపర్తి బీజేపీ మాజీ అభ్యర్థి శివరామకృంరాజు మాట్లాడుతూ.. తాను పార్టీ మాటకు కట్టుబడి పనిచేస్తానని చెప్పారు. కార్యకర్తల భావోద్వేగం మధ్య కండువా తీసేశారని.. కమలం కండువా తనపైనే ఉందన్నారు. పార్టీ నిర్ణయమే శిరోధార్యమన్నారు. అనపర్తిలో బీజేపీ అభ్యర్థిని గెలిపించి అసెంబ్లీకి పంపడమే తన లక్ష్యమన్నారు శివరామకృష్ణంరాజు. బీజేపీ గెలుపు కోసం భవిష్యత్తులో తనకు అప్పజెప్పే బాధ్యత నెరవేరుస్తామని తెలిపారు.












Click it and Unblock the Notifications