సిగ్గు లజ్జా ఉందా; ఖబడ్దార్ కొడాలి నాని, వల్లభనేని వంశీ: నందమూరి చైతన్య కృష్ణ
40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న చంద్రబాబు, శుక్రవారం నాడు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన అవమానానికి కన్నీటిపర్యంతమయ్యారు. తన భార్యను రాజకీయాల్లోకి లాగి అత్యంత అవమానకరంగా వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడారని ఆవేదనతో ఏడ్చేశారు. ఇప్పటివరకు చంద్రబాబు విలపించిన సందర్భాన్ని ఎప్పుడూ టిడిపి నేతలు చూడలేదు. అలాగే నందమూరి కుటుంబం కూడా ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు వ్యక్తిగత విమర్శలు అనుచిత దూషణలతో సెగలు పుట్టిస్తున్నాయి.
శుక్రవారం నాడు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేస్తూ, ఆయన సతీమణి భువనేశ్వరి పై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. రాజకీయాలకు దూరంగా ఉండే భువనేశ్వరిని కూడా రాజకీయాల్లోకి లాగి అవమానించారని చంద్రబాబు నాయుడు కన్నీటిపర్యంతమైన నేపథ్యంలో అటు తెలుగుదేశం పార్టీ నేతలే కాకుండా నందమూరి కుటుంబం కూడా వైసిపి నేతల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే హిందూపురం ఎమ్మెల్యే, టిడిపి నేత నందమూరి బాలకృష్ణ మా కుటుంబం జోలికి వస్తే సహించేది లేదు ఖబడ్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇక తాజాగా నందమూరి చైతన్య కృష్ణ వైసిపి నేతల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాజకీయాల కోసం మహిళలను కించపరిచేలా మాట్లాడారంటూ ధ్వజమెత్తారు. మీకు అసలు సిగ్గు లజ్జ ఉందా అంటూ నందమూరి చైతన్య కృష్ణ విరుచుకుపడ్డారు. మా తాత ఎన్టీఆర్ మహిళలకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారని గుర్తు చేసిన చైతన్య కృష్ణ ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడితే మహిళలు రాజకీయాల్లోకి వస్తారా అంటూ ఆయన వ్యక్తం చేశారు. చంద్రబాబు పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వల్లభనేని వంశీ, కొడాలి నాని లకు పదవుల్లో కొనసాగే అర్హత లేదని, వారిని బర్తరఫ్ చేయాలని నందమూరి చైతన్య కృష్ణ డిమాండ్ చేశారు.
నందమూరి కుటుంబంలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షమాపణ తెలియజేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అంటూ నందమూరి చైతన్య కృష్ణ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే రాజకీయాలతో సంబంధం లేని మహిళపై ఈ రకమైన కామెంట్స్ చెయ్యడం హేయమని నందమూరి రామకృష్ణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. భువనేశ్వరి పై కామెంట్స్ చేసిన అంశంపై ఎమోషనల్ అయిన నందమూరి రామకృష్ణ తమ కుటుంబం జోలికి ఎవరొచ్చినా విడిచిపెట్టేది లేదని వార్నింగ్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications