Nara Lokesh: విజయవాడ కోర్టు వద్ద ఉద్రిక్తత: భారీగా తెలుగుదేశం కార్యకర్తలు
తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసే సమయంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరుకావాలంటూ విజయవాడ ఒకటో అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీచేశారు. అందుకనుగుణంగా ఈరోజు లోకేష్ న్యాయమూర్తి ఎదుట హాజరయ్యారు. లోకేష్‌తోపాటు కొల్లు రవీంద్ర కూడా హాజరయ్యారు.

కోర్టు దగ్గర ఉద్రిక్తత
కోర్టు దగ్గర తెలుగుదేశం పార్టీ నేతలు వ్యవహరిస్తున్న శైలిపై పోలీసులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. కోర్టు దగ్గర టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఏం పనంటూ నేతలు ఎదురు తిరిగారు. నారా లోకేష్ కోర్టుకు హాజరయ్యే సమయంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా భారీగా తరలిరావడంతో కాస్తంత ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. తెలుగుదేశం కార్యకర్తలను చెల్లాచెదురు చేయడానికి లాఠీఛార్జి చేయాల్సిన అవసరం వస్తుందేమో అనుకున్నప్పటికీ ఇరువైపులా శాంతించడంతో ఎటువంటి వివాదం లేకుండా అంతా ప్రశాంతంగా జరిగిపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

14 కేసులు పెట్టి ఏం పీకారు? ఇంకో 10 కేసులు పెట్టండి!!
తనను అరెస్ట్ చేయడానికి ఇప్పటివరకు 14 కేసులు పెట్టారని, ఏం పీకారని, కావాలంటే మరో 10 కేసులు పెట్టుకోండంటూ సలహా ఇచ్చారు. తప్పు చేయలేదు కాబట్టే తాను కోర్టుకు హాజరయ్యాయని, జగన్ మాదిరిగా కోర్టు నుంచి వాయిదాలు తీసుకోవడంలేదంటూ చురకలు అంటించారు. త్వరలోనే ప్రజలంతా జగన్‌రెడ్డిపై రాళ్లతో దాడిచేసే రోజు వస్తుందన్నారు. 2016 నుంచి తనపై చేసిన అవినీతి ఆరోపణలకు చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నానని, మీరుకానీ, మీ ప్రభుత్వం కానీ సిద్ధంగా ఉందా? అని ప్రశ్నించారు.

జగన్ లక్ష్యంగా విమర్శల దాడులు
కొద్దిరోజులుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకొని తీవ్రస్థాయి విమర్శలు గుప్పిస్తున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోసారి ముఖ్యమంత్రిపై మండిపడ్డారు. కోర్టుకు హాజరై బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడారు. తాను ఇప్పటివరకు ఎన్నో కుంభకోణాలకు పాల్పడినట్లు ఆరోపణలు చేశారని, ఇంతవరకు ఒక్క ఆరోపణను కూడా రుజువు చేయలేకపోయారని, ఇప్పుడు ఏమీ పీకలేక కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించానంటూ కోర్టుకు తీసుకువచ్చారని లోకేష్ ఫైరయ్యారు. జగన్‌రెడ్డి నా వెంట్రుక కూడా పీకలేరంటూ సవాల్ విసిరారు.












Click it and Unblock the Notifications