వైద్య విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా.. ఎంబీబీఎస్ పరీక్షలపై లోకేష్ డిమాండ్ ఇదే!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభన కొనసాగుతోంది. విపరీతంగా పెరిగిన కరోనా కేసులతో రాష్ట్రంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక ఇదే సమయంలో ఏపీలో వైద్య విద్యార్థులు సైతం కరోనా బారినపడి విలవిలలాడుతున్నారు. అయినప్పటికీ వైద్య విద్యార్థులకు ఎంబీబీఎస్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ.

వైద్య విద్యార్థుల ఎంబీబీఎస్ పరీక్షలు వాయిదా వెయ్యాలని విజ్ఞప్తులు
ఈ సమయంలో ఈనెల 28వ తేదీ నుంచి ఎంబీబీఎస్ ఫస్టియర్ పరీక్షలు నిర్వహించాలని వచ్చే నెల 1వ తేదీ నుంచి రెండో సంవత్సరం వారికి పరీక్షలు నిర్వహించాలని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇక ఈ నిర్ణయం పై రాష్ట్రవ్యాప్తంగా పలువురు విద్యార్థుల నుండి, విద్యార్థుల తల్లిదండ్రుల నుండి పరీక్షలు వాయిదా వేయాలని విజ్ఞప్తులు వెల్లువగా మారాయి. ఇక తాజాగా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య విద్యార్థులకు నిర్వహించే ఎంబిబిఎస్ పరీక్షలను వాయిదా వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

అన్ని రాష్ట్రాలు పరీక్షలు వాయిదా వేశాయి .. ఏపీలో కూడా పరీక్షలు వాయిదా వెయ్యండి : లోకేష్
ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన లోకేష్ కరోనా థర్డ్ వేవ్ ఉదృతంగా ఉన్న నేపధ్యంలో అన్ని రాష్ట్రాలు పరీక్షలు వాయిదా వేసినా మన రాష్ట్రంలో నిర్వహిస్తామని హెల్త్ యూనివర్సిటీ మొండి పట్టు పట్టడం మంచిది కాదు అంటూ హితవు పలికారు. పరీక్షలు రాయాల్సిన 3 వేల మంది విద్యార్థుల్లో సుమారుగా 600 మంది కరోనా బారిన పడ్డారు. అయినప్పటికీ పరీక్షలు నిర్వహించాలని మొండి పట్టుదల మంచిది కాదని హితవు పలికారు.

వైద్య విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం మంచిది కాదు : లోకేష్
వైద్య విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడకుండా ఈ నెల 28 నుంచి నిర్వహించ తలపెట్టిన ఎంబీబీఎస్ మొదటి ఏడాది పరీక్షలు, ఫిబ్రవరి 1 నుండి నిర్వహించాలనుకుంటున్న రెండవ ఏడాది పరీక్షలు వాయిదా వెయ్యాలి అని నారా లోకేష్ డిమాండ్ చేశారు.విద్యార్థులు, తల్లిదండ్రుల ఆవేదనను అర్థం చేసుకొని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అధికారులు తక్షణమే పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాలి అని నారా లోకేష్ పేర్కొన్నారు.
Recommended Video

ఇప్పటివరకు 2 వేల మెయిల్స్ ... అయినా పరీక్షల వాయిదాపై సైలెంట్ గా ఉన్న ఎన్టీఆర్ యూనివర్సిటీ
ఇదిలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల మంది వైద్య విద్యార్థుల్లో ఆరు వందల మందికి కరోనా సోకింది . కడప, చిత్తూరు, ఒంగోలు, అనంతపురం జిల్లాలో అత్యధికంగా వైద్య విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేయాలని విద్యార్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. వారం రోజుల నుంచి అధికారులకు రెండు వేలకు పైగా ఇ-మెయిల్స్ ను పంపించి పరీక్షల వాయిదా కోసం అటు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. అయినప్పటికీ హెల్త్ యూనివర్సిటీ అధికారులు స్పందించటం లేదని, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పంపిస్తున్న వినతి పత్రాలను బుట్టదాఖలు అవుతున్నాయి అన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు బోధనా ఆసుపత్రుల పరిస్థితిని ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించి పరీక్షలను వాయిదా వేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications