ఆటో వెనుక కొటేషన్లు చదువుతుంటే.. లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
ఏపీలో కూటమి సర్కార్ ఆటో డ్రైవర్లకు ఏడాదికి 15 వేలు సాయం అందించే ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ఇవాళ విజయవాడలో ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం అందిస్తున్న సాయంపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ మాట్లాడారు. ఇందులో నారా లోకేష్ ఆటో వెనుక కొటేషన్లపై చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి.
ఇంట్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నా.. ఆటో డ్రైవర్లు నవ్వుతూ పలకరిస్తారని మంత్రి నారా లోకేష్ తెలిపారు. గ్రామస్థాయి నుంచి దేశ రాజకీయాలన్నీ ఆటో డ్రైవర్లే చర్చిస్తుంటారన్నారు. ఆనాడు ఎన్టీఆర్ ఖాకీ డ్రెస్సు వేసుకుని చైతన్యరథంపై పర్యటించారని గుర్తుచేసుకున్నారు. ఆటోల వెనుక ఉన్న కొటేషన్లు చదువుతూ ఉంటా.. కొటేషన్లు చూస్తుంటే.. వారి మనస్సు ఏంటో అర్థమవుతోందని లోకేష్ వ్యాఖ్యానించారు.

ఆటో డ్రైవర్లు ఆటోలో ఏ వస్తువు మరచిపోయినా పోలీసులకు ఇస్తారని, ఎన్ని సమస్యలు ఉన్నా నవ్వుతూ ఆదరిస్తారని లోకేష్ వారికి కితాబిచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో అన్ని రకాల ఛార్జీలు వేసి డ్రైవర్లపై భారం మోపారని, కూటమి ప్రభుత్వం రాగానే గ్రీన్ ట్యాక్స్‌ను తగ్గించామని లోకేష్ తెలిపారు. రూ.2 వేల కోట్లు ఖర్చుపెట్టి రోడ్లపై గుంతలకు మరమ్మతులు చేశామని తెలిపారు. ఇప్పుడు ఏడాదికి రూ.15 వేలు సాయం అందించే పథకాన్ని కూడా వారి కోసం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
విజయవాడ సింగ్ నగర్ లో నిర్వహించిన ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభ సభకు భారీగా ఆటో డ్రైవర్లు తరలివచ్చారు. ప్రభుత్వం ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 2.9 లక్షల మంది ఆటో, క్యాబ్ యజమానులు కమ్ డ్రైవర్ల ఖాతాలో ఇవాళ 15 వేల రూపాయలు జమ చేస్తోంది. ఈ పథకంలో డబ్బులు రాని వారికి తిరిగి తప్పులు సరి చేసుకుని దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా కల్పిస్తోంది. దీంతో ఆటో డ్రైవర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉచిత బస్సు పథకంతో ఇబ్బందులు పడుతున్న ఆటో డ్రైవర్లకు ఇది ఊరట కలిగించనుంది.












Click it and Unblock the Notifications