సచిన్ తో నారా లోకేష్: ఎక్కడ? ఎందుకు?
పుట్టపర్తి సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలు నేడు ఆరంభం కానున్నాయి. ఇందులో పాల్గొనడానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పుట్టపర్తికి చేరుకోనున్నారు. ఈ శత జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించడానికి ప్రశాంతి నిలయం ప్రతినిధులు ఏర్పాట్లు పూర్తి చేస్తోన్నారు. సత్యసాయి సేవా సంస్థలు ఆ రోజున పలు ఆధ్యాత్మిక సమావేశాలు, సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉత్సవాలను ప్రారంభించనున్నారు. మహాసమాధిని వద్ద నివాళి అర్పిస్తారు. అనంతరం సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి బాబా జీవితం, బోధనలు, శాశ్వత వారసత్వాన్ని గౌరవిస్తూ స్మారక నాణేన్ని విడుదల చేస్తారు. శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేకంగా ముద్రించిన పోస్టల్ స్టాంపులను ఆవిష్కరిస్తారు. అక్కడే ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మంత్రి నారా లోకేష్ పుట్టపర్తికి వచ్చారు. ఇవే ఉత్సవాలకు హాజరు కానున్న సచిన్ టెండుల్కర్ ను ఆయన మర్యాదపూరకంగా కలిశారు. తోటి మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్ కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తదితర ప్రముఖులు హాజరు కానున్నారు.
సచిన్ టెండుల్కర్ ను కలిసిన ఫొటోలను నారా లోకేష్ తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్‌ను కలవడం ఓ గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో క్రీడల అభివృద్ధి, శ్రీ సత్యసాయి బాబా బోధనలు వంటి పలు అంశాల గురించి ఆయనతో మాట్లాడానని తెలిపారు. ఈ సమావేశం తనకెంతో ఉత్సాహాన్ని, సంతోషాన్ని ఇచ్చిందని నారా లోకేష్ వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా క్రికెట్ పరిణామాలు ప్రస్తావనకు వచ్చాయని, సచిన్ అద్భుతమైన కెరీర్‌లోని మరపురాని ఘట్టాలను గుర్తు చేసుకున్నానని అన్నారు. ఏపీలో క్రీడల అభివృద్ధికి జరుగుతున్న కృషి గురించి వివరించానని పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల వేళ.. ఆయన జీవితం, బోధనలు, మానవత్వానికి ఆయన చేసిన సేవలను కూడా గుర్తుచేసుకున్నామని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications