22 నుంచి అమరావతి చరిత్ర ప్రారంభం: లోకేశ్, సంకల్ప జ్యోతిని వెలిగించిన బాబు
అమరావతి: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి చరిత్ర అక్టోబర్ 22 నుంచి ప్రారంభమవుతుందని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. గుంటూరులో మంగళవారం జరిగిన రామినేని ఫౌండేషన్ 16వ ప్రతిభా పురస్కారాల ప్రధాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ అవకాశాలను అందిపుచ్చుకునేలా చదువులు మలుచుకోవాల్సిన అవసం ఎంతైనా ఉందన్నారు. విద్యార్ధులు కలలు కని వాటిని సాకారం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
భవిష్యత్తు తరాలు మనదేశాన్ని గొప్పగా చెప్పుకునేలా యువత, విద్యార్ధులు అడుగు వేయాలని అన్నారు. చెన్నై, ముంబై, కోల్‌కత్తా లాంటి నగరాలకు వందల ఏళ్ల చరిత్ర ఉందని చెప్పిన ఆయన అమరావతి చరిత్ర అక్టోబర్ 22 నుంచి మొదలవుతోందన్నారు.

ఈ కార్యక్రమంలో గతేడాది అత్యధిక మార్కులు సాధించిన 281 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు.
అమరావతిలో సంకల్ప జ్యోతిని వెలిగించిన సీఎం చంద్రబాబు
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన సంకల్ప జ్యోతిని సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం ప్రారంభించారు. రాజధాని నిర్మాణ పనులు ఎలాంటి ఆటంకం లేకుండా నిర్విజ్ఞంగా కొనసాగాలని ఈ జ్యోతిని వెలిగించారు.
అంతక ముందు ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ గుడి వద్ద ఈ జ్యోతిని మంత్రులు పరిటాల సునీత, దేవినేని ఉమామహేశ్వరరావు, కరణం మల్లేశ్వరి చేతుల మీదగా విజయవాడలో ప్రారంభించారు. ఇంద్రకీలాద్రి నుంచి అమరావతి వరకు సంకల్ప జ్యోతిని యాత్రగా నిర్వహించారు. అక్టోబర్ 22వ తేదీ వరకు ఈ సంకల్పజ్యోతి నిరంతరాయంగా వెలగనుంది.












Click it and Unblock the Notifications