బ్రహ్మాండం బద్దలై పోదు, వదిలేది లేదు: కెసిఆర్‌పై లోకేష్ దూకుడు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంగళవారంనాడు ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. నోటుకు ఓటు కేసుపై కూడా ఆయన స్పందించారు.
నోటుకు ఓటు కేసులో నోటీసులు ఇచ్చినంత మాత్రాన బ్రహ్మాండం బద్దలై పోదని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వానికి ఫోన్ ట్యాపింగ్ భయం పట్టుకుందని వ్యాఖ్యానించారు. అందితే జట్టు అందకపోతే కాళ్లు అనేది కెసిఆర్ తత్త్వమని ఆయన దుయ్యబట్టారు. లేకపోతే ఉన్నతాధికారులను ఎందుకు మారుస్తున్నారని, అధికారులు ఎందుకు సెలవుపై వెళ్తున్నారని ఆయన ప్రశ్నించారు.

కర్నూలు జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మహబూబ్‌నగర్ జిల్లాలో క్యాంప్ పెట్టుకోవడం రాజకీయ దివాళాకోరుతనమని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని సాదాసీదా వదిలేది లేదని ఆయన హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదైన కేసులకు కెసిఆర్ సమాధానం చెప్పుకోవాలని ఆయన అన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎలా ఉంటుందో భవిష్యత్తులో తెలుస్తుందని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. తమ ఇంటి నిర్మాణానికి అడ్డు తగలడమే తెలంగాణ ప్రభుత్వ ప్రతికూల వైఖరిని తెలియజేస్తోందని ఆయన అన్నారు.
ఇదిలావుంటే, ఓటుకు నోటు కేసులో నిందితుడు, టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేయగానే ఆపార్టీ నేతలు అత్యుత్సాహంతో మాట్లాడుతున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మండిపడ్డారు. కేసులో నిందితుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి బెయిల్‌పై బయటకు వస్తుంటే ఇంత హంగామా చేస్తున్నారని ఎద్దేవా చేశారు. బెయిల్ రావడంతోనే తమకు న్యాయం జరిగిందని, తమ తప్పేమీలేదన్నట్టు టీడీపీ నేతలు భావిస్తున్నారని మండిపడ్డారు.
ఈ రోజు తాత్కాలికంగా బయటకు రావచ్చు కానీ మళ్లీ కచ్చితంగా జైలుకు వెళ్లక తప్పదని తెలిపారు. చట్టం రేవంత్‌రెడ్డి చుట్టం కాదు, చంద్రబాబు చుట్టం కాదని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై ఏసీబీ అధికారులు సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని తెలిపారు.












Click it and Unblock the Notifications