జగన్ రెడ్డిది గాలిపార్టీ .. టీడీపీ అన్ స్టాపబుల్ : బాలయ్య డైలాగ్‌తో రెచ్చిపోయిన లోకేష్
తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తెలుగు తమ్ముళ్లు ఘనంగా నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ దేశాల్లో ఉన్న టీడీపీ అభిమానులు కన్నుల పండుగగా జరుపుకున్నారు. సైకిళ్లు, బైకులు, కార్లతో ర్యాలీలు నిర్వహించారు. టీడీపీ జెండా ఎగురవేసి.. సర్గీయ ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. మంగళగిరిలో ఏర్పాటు చేసిన టీడీపీ ఆవిర్భావోత్సవ సభకు పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై ఓ రేంజ్ లో రెచ్చిపోయారు.

జగన్ రెడ్డిది అడ్రస్ లేని పార్టీ
టీడీపీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు లోకేష్. హీరో నందమూరి బాలకృష్ణ డైలాగులను గుర్తొచ్చేలా వైసీపీపై విరుచుకుపడ్డారు. రికార్డులు సృష్టించాలన్నా.. వాటిని తిరగరాయాలన్నా.. తెలుగుదేశంతోనే సాధ్యమంటూ తన దైన స్టైల్‌లో చెప్పారు. తెలుగు ప్రజల పార్టీ టీడీపీ .. కానీ జగన్ రెడ్డిది గాలికి వచ్చిన పార్టీ అని సైటెర్లు వేశారు. తెలుగుదేశం పార్టీ ఆన్ స్టాపబులుల్ అని బాలయ్య డైలాగ్‌తో వైసీపీపై లోకేష్ రెచ్చిపోయారు. తెలుగుదేశం పార్టీ స్థాపించింది.. అన్న ఎన్టీఆర్ అని గుర్తుచేశారు.. కానీ జగన్ రెడ్డిది కేర్ అఫ్ అడ్రస్ లేని పార్టీ అంటూ విమర్శలు గుప్పించారు.

సమయం లేదు మిత్రమా...
రాష్ట్ర ప్రజలు రాముడు చంద్రన్న వైపు ఉంటారో.. రాక్షసులు జగన్ రెడ్డి వైపు ఉంటారో తేల్చుకోవాలని లోకేష్ అన్నారు. సమయంలేదు మిత్రమా.. ఇక రెండేళ్లే మిగిలి ఉందంటూ సినిమా డైలాగ్‌తో వైసీపీకి చురకలు అంటించారు. లోకేష్ డైలాగులతో సభలో తెలుగు తమ్ముళ్లు ఈలలతో సభా ప్రాంగణాన్ని మారుమోగించారు. అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉండేది ఒక్క టీడీపీ మాత్రమేనని స్పష్టం చేశారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన పార్టీ అని అన్నారు. జగన్ పాలనపై ప్రజలు విసిగిపోయారని పేర్కొన్నారు. వైసీపీ బుద్ధి చెప్పేందకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.

వైసీపీ నేతలకు సినిమా మొదలైంది..
టీడీపీ నేతలను, కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వైసీపీ నాయకులకు, అధికారులకు సినిమా మొదలవుతోందని లోకేష్ హెచ్చరించారు. తనపై హత్యాయత్నంతో పాటు 11 తప్పుడు కేసులు పెట్టారని దుయ్యబట్టారు. తన తల్లిని అవమానించి... తనను బాధపెట్టిన వారిని విడిచిపెట్టేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా వెళ్లినా, ఐవరీ కోస్ట్ లో దాక్కున్నా ఏ ఒక్కరినీ వదిలి పేట్టేది లేదని తేల్చిచెప్పారు. మనం దేనికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. వైసీపీ దుర్మార్గాలపై తెగించి పోరాడాలని కార్యకర్తలకు లోకేష్ పిలుపునిచ్చారు. రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టు రాలేదు.. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవని ఆరోపించారు. వైసీపీ నేతల దౌర్జన్యాలకు ఉన్న పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయామని దుయ్యబట్టారు.

ప్రజలు సంతోషంగా బతకడం ఇష్టం లేదా?
మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని సీఎం జగన్ నాశనం చేశారని లోకేష్ మండిపడ్డారు. రాష్ట్ర విభజన తర్వాత బంగారు బాతు లాంటి హైదరాబాద్‌ను కోల్పోయామన్నారు. హైదరాబాద్ కు దీటైన నగరం ఉండాలనే నాడు రాష్ట్ర రాజధానిగా అమరావతిని చంద్రబాబు ప్రకటించారు. అమరావతి నిర్మాణం ప్రారంభించారని చెప్పారు. అభివృద్ధి వికేంద్రకరణకు శ్రీకారం చుట్టింది చంద్రబాబు అని అన్నారు. టీడీపీ పాలనలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందాయన్నారు. కానీ జగన్ రెడ్డి ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో రెట్టింపు ప్రజల నుంచి వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి పన్ను, చెత్త పన్ను అంటూ జనం ఆస్తులను జప్తు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజలు సంతోషంగా బతకడం జగన్‌కు ఇష్టం లేదని విమర్శించారు. తుగ్లక్ పాలనపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందన్నారు.












Click it and Unblock the Notifications