'హైదరాబాద్' మాదే!: కేసీఆర్‌ను ఏకేసిన లోకేష్, అందరిలా బాలకృష్ణ..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన టీడీపీ యువనేత నారా లోకేష్ ఆదివారం మండిపడ్డారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్‌ను లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయాలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తామన్నారు.
ఎన్టీఆర్ ట్రస్టు తరఫున అందరికీ ఆరోగ్యం, విద్య నినాదంతో సేవలు చేస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఉన్నతస్థాయి ప్రమాణాలతో పాఠశాలలను ఏర్పాటు చేస్తామన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందు చూపున్న నాయకుడన్నారు. ప్రతినెల 1000 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందని ఆరోపించారు. పోలీసులకు కొత్త కార్లు ఇవ్వడం తప్ప చేసిందేమీ లేదన్నారు.

ఎవరెన్ని చేసినా టీడీపీకి ఏం కాదన్నారు. రానున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మేయర్ పదవి తమ పార్టీకే వస్తుందన్నారు. తెలంగాణలో వచ్చే ఆరునెలల్లో తాగునీరు, విద్యుత్ సమస్య ఎదుర్కోవాల్సి వస్తుందని, తెలంగాణలో వసూలు చేస్తున్న పన్నులకు తగ్గట్లుగా పనులు జరగడం లేదన్నారు.
హిందూపురంలో బాలకృష్ణ
తెలుగు సినిమా హీరో, హిందూపురం శాసన సభ్యుడు బాలకృష్ణ తన నియోజకవర్గంలో బిజీగా గడుపుతున్నారు. ఆయన ఆదివారం ఉదయం ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తన తండ్రి వర్ధంతి సందర్భంగా హిందూపురంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో బాలయ్య కూడా పాల్గొని, భోజనం చేస్తున్న సమయంలో అందరిలా వరుసలో వచ్చి, స్వయంగా వడ్డించుకున్నారు!












Click it and Unblock the Notifications