ప్రజల్లోకి భువనేశ్వరి, లోకేశ్ - చంద్రబాబు ఎన్నికల మంత్రాంగం..!!
ఎన్నికల వేళ చంద్రబాబు తిరిగి యాక్టివ్ అవుతున్నారు. వరుస కేసులు..రిమాండ్..అనారోగ్య సమస్యలతో దాదాపు మూడు నెలలుగా చంద్రబాబు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు తిరిగి ఎన్నికల కార్యాచరణ పైన మంత్రాంగం ప్రారంభించారు. నారా లోకేశ్ తన తండ్రి అరెస్ట్ తో నిలిచిన యువగళం యాత్రను తిరిగి ప్రారంభించేందుకు ముహూర్తం నిర్ణయించారు. భువనేశ్వరి సైతం తిరిగి తన యాత్ర ప్రారంభించేందుకు సిద్దమవుతున్నారు.
యువగళం ప్రారంభం: యువ గళం పాదయాత్రను 27నుంచి పునఃప్రారంభించాలని లోకేశ్ నిర్ణయించారు. సెప్టెంబరు 9న కోనసీమ జిల్లా రాజోలు మండలంలో ఆయన తన పాదయాత్రను ఆపారు. ఆపినచోట నుంచే ఆయన ప్రారంభిస్తున్నారు. కార్తీక సోమవారం ఉదయం 10:17గంటలు మంచి ముహూర్తమని నిర్ణయించారు. ఆ ముహూర్తానికి ఆయన పాద యాత్ర ప్రారంభవుతుంది.

డిసెంబరు నెలాఖరు వరకూ ఇది కొనసాగే అవకాశం ఉంది. ఈ యాత్ర ఎటు నుంచి ఎటు వెళ్లాలన్నదానిపై పార్టీ నాయకత్వం జిల్లాల నేతలతో చర్చిస్తోంది. ఒకటి రెండు రోజుల్లో యాత్ర మార్గం మొత్తం ఖరారయ్యే అవకాశం ఉంది. లోకేశ్ తల్లి భువనేశ్వరి డిసెంబరు మొదటివారం నుంచి తన పర్యటనలు ప్రారంభించనున్నారు.
ప్రజల్లోకి భువనేశ్వరి: చంద్రబాబు అరెస్టు సమయంలో మనస్థాపానికి గురై మరణించిన వారి కుటుంబాలను పరామర్శించడానికి నిజం గెలవాలి అన్న పేరుతో ఆమె ఒక యాత్రను చేపట్టిన విషయం తెలిసిందే. ఈ యాత్ర చేపట్టిన కొద్ది రోజులకే జైలు నుంచి చంద్రబాబు విడుదల కావడంతో దానిని ఆపుచేశారు. ఆమె పర్యటనలపై కూడా రూట్ మ్యాప్ ఖరారు అవుతోంది.

వారానికి మూడు రోజులపాటు ఆమె పర్యటనలు ఉండేలా కార్యక్రమం తయారవుతోంది. లోకేశ్ గోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్నందువల్ల ఆ రాయలసీమ, ఇతర కోస్తాజిల్లాల్లో ముందుగా ఆమె పర్యటనలు ఉండేలా చూడాలని నిర్ణయించారు. భువనేశ్వరి యాత్రం ఆపటం పైన రాజకీయంగా విమర్శలు వచ్చాయి. డిసెంబర్ లోనే తిరిగి యాత్ర ప్రారంభించేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.
చంద్రబాబు ఎన్నికల కసరత్తు: ఇక, చంద్రబాబు మరికొంత విరామం తీసుకొని ప్రజల్లోకి రావాలని యోచిస్తున్నారు. బెయిల్ ఆంక్షలు ఆయనకు ఈ నెల 28 వరకూ వర్తిస్తున్నాయి. ఆ తర్వాత రాజకీయ కార్యకలాపాలను ప్రారంభించే వీలును న్యాయస్థానాలు కల్పించాయి. తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో తీర్పు రావాల్సి ఉంది.

ఇవన్నీ వారం పది రోజుల్లో ఒక కొలిక్కి రావచ్చునని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఈలోపు ఆయన పార్టీ అంతర్గత కసరత్తుపై దృష్టి కేంద్రీకరించి పనిచేస్తున్నారు. నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితిని అంచనావేసి గట్టి అభ్యర్థులను గుర్తించడం, వారి బలాబలాలపై సమాచారం సేకరిస్తన్నారు. ఎన్నికల మంత్రాంగంలో చంద్రబాబు నిమగ్నమయ్యారు. సుప్రీం తీర్పు తరువాత చంద్రబాబు తన కార్యాచరణ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications