లోకేష్ యువగళం పున: ప్రారంభం, ముగింపు - అదే అసలు కారణం..!!
ఏపీ రాజకీయంలో కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. రాష్ట్రంలో మరో నాలుగు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. చంద్రబాబు కేసులతో టీడీపీలో డైలమా కొనసాగుతోంది. పవన్ కల్యాణ్ అటు తెలంగాణ లో బీజేపీతో..ఏపీలో టీడీపీతో పొత్తు కొనసాగిస్తోంది. ఇదే సమయంలో నారా లోకేశ్ తన తండ్రి అరెస్ట్ తో నిలిచిన యువగళం తిరిగి ప్రారంభించేందుకు నిర్ణయించారు. ముగించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీని వెనుక అనేక కారణాలు తెర మీదకు వస్తున్నాయి.
యువగళం ప్రారంభం:నారా లోకేశ్ తన యువగళం పాదయాత్ర తిరిగి ప్రారంభించేందుకు ముహూర్తం నిర్ణయించారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో సెప్టెంబర్ 9వ తేదీన యువగళం పాదయాత్ర నిలిచిపోయింది. పాదయాత్ర నిలిచిపోయిన చోట నుంచి తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ నెల 24వ తేదీ నుంచి తిరిగి ప్రారంభం కానుంది. చంద్రబాబు అరెస్ట్ తరువాత చోటు చేసుకున్న పరిణామాలతో లోకేశ్ యాత్ర ఆగింది. ఇక, చంద్రబాబు అరెస్ట్ తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాల పరామర్శ యాత్ర భువనేశ్వరి ప్రారంభించారు. కానీ, చంద్రబాబు మధ్యంతర బెయిల్ పైన విడుదల కావటంతో ఆ యాత్రను నిలిపివేసారు. ఇప్పుడు ఈ యాత్ర నిలిపివేయటం పైన ప్రశ్నలు మొదలయ్యాయి.

విశాఖలో ముగింపు:ఇక, లోకేశ్ యాత్ర ప్రారంభించిన త్వరలోనే విశాఖలో ముగించేలా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు గతంలో వస్తున్న మీకోసం పాదయాత్రను విశాఖలో ముగించారు. అదే సెంటిమెంటుతో లోకేష్ కూడా విశాఖలోనే పాదయాత్ర ముగించాలని నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పాదయాత్రను కుదించే యోచనలో పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, చంద్రబాబు కేసుల వ్యవహారం తేలకపోవటం..జనసేనతో పొత్తు వేళ సీట్ల సర్దుబాటు..ప్రచారం వంటి అంశాలతో పాటుగా పార్టీ వ్యవహారాల కోసమే లోకేశ్ యాత్ర కుదించినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో తెలంగాణ ఎన్నికల తరువాత పవన్ కల్యాణ్ తన వారాహి యాత్ర కొనసాగించాలని భావిస్తున్నారు.
సుప్రీం తీర్పు తర్వాతే:పవన్ యాత్ర ఉత్తరాంధ్రలో కొనసాగించాలని పార్టీ సూత్ర ప్రాయంగా నిర్ణయించింది. గోదావరి జిల్లాలతో పాటుగా ఉత్తరాంధ్రలో పరిస్థితిని తమకు అనుకూలంగా మలచుకోవాలనేది టీడీపీ - జనసేన వ్యూహంగా కనిపిస్తోంది. దీంతో, లోకేశ్ ముందుగా ఇచ్ఛాపురం వరకు యాత్ర కొనసాగించాలని భావించినా..విశాఖలోనే ముగించనున్నారు. ముగింపు సభకు కోర్టుల్లో చోటు చేసుకొనే పరిణామాల్లో వెసులుబాటు దక్కితే చంద్రబాబుతో పాటుగా పవన్, బాలయ్య హాజరు కానున్నారు. ఇక..విశాఖ నుంచి పవన్ తన యాత్ర ప్రారంభించనున్నారు. ఒకటి రెండు రోజుల్లో సుప్రీంలో చంద్రబాబు క్వాష్ పైన తీర్పు వెలువడతుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఆ తీర్పు తరువాత పూర్తి స్థాయి కార్యాచరణ ఖరారయ్యే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications