నారా రోహిత్ నిరసన - వైసిపి నేతలకు నోరెలా వచ్చింది : ఆ ఇద్దరి సమాధుల వద్ద...!!
ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలు..ఆ తరువాత మీడియా సమావేశంలో చంద్రబాబు కన్నీరు పెట్టడం పైన నందమూరి - నారా కుటుంబ సభ్యులు వైసీపీ నేతల పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నందమూరి కుటుంబం మొత్తం ఈ అంశం పైన స్పందించింది. తమ కుటుబం గురించి మాట్లాడితే నందమూరి వంశం మరో రూపం చూస్తారంటూ కుటుంబ సభ్యులు హెచ్చరించారు. భువనేశ్వరి గురించి అసభ్యంగా మాట్లాడారంటూ చంద్రబాబు కన్నీరు పెట్టటం పైన పలువురు స్పందించారు. ఆయనకు సంఘీభావం ప్రకటించారు.

వారి సమాధుల వద్ద రోహిత్ నిరసన
తాజాగా జూనియర్ ఎన్టీఆర్..కళ్యాణ్ రాం తో పాటుగా సూపర్ స్టార్ రజనీ కాంత్ సైతం చంద్రబాబుకు ఫోన్ చేసారు. ఇక, తాజాగా ప్రముఖ సినీనటుడు నారా రోహిత్ ఈ పరిణామాల పైన నిరసనకు దిగారు. అసెంబ్లీ సాక్షిగా వైసీపీ నేతలు చేసిన మానసిక దాడికి నిరసన వ్యక్తం చేస్తున్నట్లుగా వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తల్లిదండ్రులు దివంగత నారా అమ్మణమ్మ, నారా కర్జూర నాయుడు సమాధుల వద్ద నిరసన తెలిపారు.

రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు
అన్న ఎన్టీఆర్ సిఎంగా ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు నందమూరి కుటుంబం ఏనాడూ రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదని.. ఎప్పుడూ అవినీతి ఆరోపణలు ఎదుర్కోలేదని చెప్పుకొచ్చారు. పెదనాన్న చంద్రబాబు, పెద్దమ్మ భువనేశ్వరి, సోదరుడు నారా లోకేష్ క్రమశిక్షణకు మారుపేరుగా నిలచి యావత్ తెలుగుదేశం పార్టీ కేడర్ కు ఆదర్శంగా నిలిచారన్నారు. ఒక ముఖ్యమంత్రి సతీమణి హోదాలో ఉండి కూడా తమ పెద్దమ్మ భువనేశ్వరి ఏనాడూ రాజకీయాల్లో చేసుకోలేదు...గడప దాటలేదని వివరించారు. సేవా కార్యక్రమాలే పరమావధిగా జీవిస్తున్న మహోన్నత వ్యక్తిత్వం ఆమెదని వివరించారు.

నిందలు మోపుతారా అంటూ
అటువంటి ఆదర్శనీయురాలిపై లేనిపోని నిందలు మోపడానికి వైసిపి నేతలకు నోరెలా వచ్చిందో అర్థంకావడంలేదంటూ రోహిత్ వాపోయారు. ఇక, వైసీపీ నుంచి నేతలు మాత్రం అసలు తాము చంద్రబాబు సతీమణి ప్రస్తావనే తీసుకురాలేదని.. చర్చ జరగలేదని..తాము అసలు ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పుకొచ్చారు. మంత్రులు కన్నబాబు..పేర్ని నాని..బాలినేని ఇదే విషయాన్ని స్పష్టం చేసారు. భువనేశ్వరి తమకు సోదరి లాంటి వారని మంత్రి చెప్పుకొచ్చారు. చంద్రబాబు రాజకీయంగా మైలేజ్ కోసం చేస్తున్న డ్రామాగా అభివర్ణించారు.

అసలు ఆమో ప్రస్తావనే రాలేదు
తమ ఇంట్లోనూ మహిళలు ఉన్నారని..తాము చంద్రబాబు చెబుతున్నట్లుగా అసలు భువనేశ్వరి గురించి మాట్లాడలేదని చెబుతున్నారు. చంద్రబాబు ఇప్పటికే తాను ఇక అసెంబ్లీకి రానని.. ప్రజా క్షేత్రంలో తేల్చుకొని తిరిగి సీఎం అయిన తరువాతనే సభలో కాలు పెడతానని శపధం చేసారు. ఇక, సినీ రంగ..రాజకీయ ప్రముఖులు సైతం ఇప్పటికే చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించారు. జరిగిన పరిణామల పైన ఆవేదన వ్యక్తం చేసారు. ఇక, ఇప్పుడు ఈ అంశం రాజకీయంగా వైసీపీని ఆత్మరక్షణలోకి నెట్టేసింది.












Click it and Unblock the Notifications