నరసాపురం మచిలీపట్నం ప్రజలకు శుభవార్త!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మోడీ సర్కార్ శుభవార్త చెప్పింది. బ్రిటిష్ కాలం నుంచి ప్రతిపాదనలకే పరిమితమైన నరసాపురం మచిలీపట్నం మధ్య రైల్వే లైన్ ఏర్పాటుకు పచ్చ జెండా ఊపింది. నరసాపురం మచిలీపట్నం మధ్య రైల్వే లైన్ కోసం సర్వే చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈ ప్రతిపాదనలు రావడంతో నరసాపురం మచిలీపట్నం మధ్య కొత్త రైల్వే లైన్ పైన కోస్తా తీరప్రాంత ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కోటిపల్లి రైల్వే లైన్.. నరసాపురం జంక్షన్
ఇప్పటికే నరసాపురం నుంచి భీమవరం మీదుగా నిడదవోలు, విజయవాడ, గుంటూరు, నాగర్ సోల్, బెంగళూరు, హుబ్లీ, ధర్మవరం, లింగంపల్లి, హైదరాబాద్ కు రైళ్ల రాకపోకలు సాగుతున్నాయి. ఇదిలా ఉంటే ఫిబ్రవరిలో 300 కోట్ల నిధులను కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ పనులకు కేటాయించారు. ఈ పనులు పూర్తి అయితే నరసాపురం జంక్షన్ గా మారుతుంది.

బ్రిటీష్ కాలం నుండి నరసాపురం మచిలీపట్నం రైల్వే లైన్ ప్రతిపాదన
ఇక తాజాగా కేంద్రం నరసాపురం మచిలీపట్నం మార్గాన్ని రైల్వే రూట్ లో కలపాలని నిర్ణయం తీసుకోవడంతో, కోస్తాతీరం వెంబడి రైలు మార్గం ఏర్పడుతుందని అభిప్రాయం స్థానిక ప్రజల్లో ఉంది. బ్రిటిష్ కాలం నుండి మచిలీపట్నం నరసాపురం మార్గాన్ని రైల్వే రూట్ లో కలపాలని ప్రతిపాదన ఉన్నప్పటికీ దీనికి భారీగా వ్యయమవుతుందని, 69కిలోమీటర్ల మేర కొత్తలైన్ కు పలుచోట్ల వంతెనలు కట్టాల్సి ఉంటుందని ఈ ప్రపోజల్ ప్రతీసారి పెండింగ్ పడుతూ వచ్చింది.
నరసాపురం రైల్వే లైన్ పై కోనసీమ వాసుల హర్షం
ప్రస్తుతం ఎవరైనా రైల్లో మచిలీపట్నం వెళ్లాలంటే గుడివాడ వెళ్లి అక్కడ నుంచి రైలు మారాలి. అదే నరసాపురం నుంచి మచిలీపట్నం పూర్తయితే మొగల్తూరు, బంటుపల్లి మీదుగా ప్రయాణం చేయవచ్చు, ఇక ఈ క్రమంలో తాజాగా మచిలీపట్నం నరసాపురం రైల్వే లైన్ పై కేంద్రం దృష్టిసారించడంతో పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నరసాపురం మచిలీపట్నం రైల్వే లైన్ పనులకు సర్వే
కోటిపల్లి రైల్వే లైన్ కారణంగా కాకినాడ నుంచి నరసాపురం వరకు రైలు మార్గం ఏర్పడింది. ఇప్పుడు నరసాపురం మచిలీపట్నం కూడా రైలు మార్గం ఏర్పడితే కోస్తా సముద్ర తీరం వెంబడి మొత్తం రైలు కూత వినిపించనుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ లో సర్వే పనులు చేపడుతున్నట్టు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఇక ఇదే కనక పూర్తి అయితే నరసాపురం పెద్ద జంక్షన్ కావడం మాత్రమే కాకుండా కోస్తా తీర ప్రాంత ప్రజలకు అన్ని విధాలుగా లాభం జరుగుతుంది.












Click it and Unblock the Notifications