బీజేపీలోకి: జగన్ పార్టీపై నారాయణ సంచలనం, ఢిల్లీలో..
హైదరాబాద్/న్యూఢిల్లీ: సీపీఐ నేత నారాయణ ఆదివారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మూకుమ్మడిగా భారతీయ జనతా పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తోందన్నారు. దీనిని చెడగొట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లారని ఆరోపించారు. అధికార, ప్రతిపక్ష నేతలు ప్రజా సమస్యలను వదిలేసి ఢిల్లీకి చక్కెర్లు కొడుతున్నారని విమర్శించారు.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సుజనా చౌదరికి కేంద్రమంత్రి పదవి ఇవ్వడంతో ఆ పార్టీ కార్పోరేట్ పార్టీగా నిరూపించుకుందన్నారు. భవిష్యత్తులో కమ్యూనిస్టు పార్టీలు అన్నీ ఒకే వేదిక పైకి వచ్చి ఉద్యమించాలన్నారు. అందుకు తమ పార్టీ ప్రయత్నాలు చేస్తోందన్నారు. చంద్రబాబు అబద్దపు హామీలకు ఈ నెల 19వ తేదీన కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.
రాజ్‌నాథ్‌ను కలిసిన జగన్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం మధ్యాహ్నం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశారు. హుధుద్ తుఫాను బాధితులను ఆదుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు కేంద్రమంత్రి పదవి కోసం చేసిన పోరాటం ప్రజల కోసం చేస్తే బాగుండేదని ఎద్దేవా చేశారు.
రెసిడెన్షియల్ స్కూల్స్‌గా సంక్షేమ హాస్టల్స్: రావెల
సంక్షేమ హాస్టల్స్‌ను రెసిడెన్సియల్ స్కూల్స్‌గా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి రావెల కిషోర్ బాబు చెప్పారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేశామని ఆయన అన్నారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆదివారం విజయవాడ వచ్చిన ఆయన కస్తూరిభాయి పేటలోని బాలికల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనికీ చేశారు. మరమ్మతుల కోసం నిదులు విడుదల చేస్తున్నట్లు మంత్రి చెప్పారు.
మంత్రి మీడియాతో మాట్లాడుతూ హాస్టల్స్ అన్నింటిని కూడా క్రమేపి రెసిడెన్షియల్ స్కూల్స్‌గా మార్చాలనేది తమ ప్రభుత్వ విధానమని చెప్పారు. రెసిడెన్షియల్ స్కూల్స్‌గా మారినందువల్ల లాభాలు ఉన్నాయని, మంచి భవనాలు నిర్మించుకోవచ్చునని, సౌకర్యాలు కల్పిస్తామని, ఇంగ్లీష్ మీడియంగా మార్పు, కంప్యూటర్ల సదుపాయం, క్రీడా స్థలం, మినీ ఆడిటోరియం తదితర సదుపాయాలు కల్పిస్తామన్నారు.












Click it and Unblock the Notifications