దుర్మార్గుడు, కమలమ్మని అడిగితే..: నిజాంపై నారాయణ
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లు పైన చర్చ సమయంలో నిజాం రాజును పలువురు ప్రజా ప్రతినిధులు కీర్తించడాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తప్పు పట్టారు. వారిపై తీవ్రంగా మండిపడ్డారు. నిజాంను కీర్తించడం బానిసత్వమేనని, వేలమందిని చంపిన దుర్మార్గుడని ధ్వజమెత్తారు. నిజాం పానను పొగిడేవారిది బానిసల కంటే బానిసల బుద్ధి అన్నారు. నిరంకుశానికి మారుపేరు నిజాం అన్నారు. ఆయనను కీర్తించడం ఘోర అవమానమన్నారు.
నిజాం నాలుగు వేలమంది ప్రజలను చంపాడని, అలాంటి దుర్మార్గుడిని కొందరు మంచి పాలన అందించారని పొగుడుతున్నారని, వారిది బానిసల బుద్ధి అన్నారు. నిజాంపై చేసిన పోరాటంలో కన్నబిడ్డను త్యాగం చేసిన కమలమ్మ వరంగల్‌లో ఉన్నారని, ఆమె దగ్గరకు వెళ్లి ఇదే మాట అనాలని, అప్పుడు ఆమె మీ ముక్కు పిండి మీతో గుంజీలు తీయిస్తారని ధ్వజమెత్తారు.

శాసనసభలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మతిభ్రమించినట్లుగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. పిచ్చి ఆస్పత్రిలో మానసిక రోగివలె వ్యవహరిస్తున్నారని, కాళ్లు పైకెత్తి, తలకిందులు చేసి తపస్సు చేసినా తెలంగాణ ఏర్పాటును ఆయన ఆపలేరన్నారు. రాష్ట్ర విభజనకు, రైతాంగ సాయుధ పోరాటానికి పొంతనేంటని ప్రశ్నించారు. విభజనతో నష్టాలపై గంటలకొద్దీ మాట్లాడుతూ బిల్లుపై చర్చను పక్కదారి పట్టించి ప్రజలను కిరణ్ మోసం చేస్తున్నారన్నారు.
బిల్లుపై చర్చకు 42 రోజుల సమయం ఇచ్చారని, రోజుకు ఎనిమిది గంటల చొప్పున చర్చిస్తే 400 గంటల సమయం మాట్లాడవచ్చునని, ఒక్కో సభ్యుడు గంట చొప్పున మాట్లాడినా ఇంకా సమయం మిగిలుతుందని లెక్క చెప్పారు. ఇప్పటిదాకా మాట్లాడకుండా గాడిదలు కాస్తున్నారా? సభను బందెల దొడ్డిని చేసి చివరి నిమిషంలో సమయం సరిపోదంటారా? అని ధ్వజమెత్తారు. వైయస్సార్ కాంగ్రెసు, టిడిపిలలోకి వెళ్లలేని వారు కిరణ్‌ను పార్టీ పెట్టాలని ప్రోత్సహిస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications