నరేంద్రమోడీ, అమిత్ షా టార్గెట్ చంద్రబాబునాయుడు??
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మీడియా దిగ్గజం రామోజీరావును, కథానాయకుడు ఎన్టీఆర్ ను కలిసిన తర్వాత వచ్చినన్ని ఎక్కువ వార్తలు మీడియాలో ఇతర అంశాలపై రాలేదంటే అతిశయోక్తి కాదు. బీజేపీ, టీడీపీ ఏపీలో మళ్లీ పొత్తు పెట్టుకుంటాయని, ఎన్డీయేలో మిత్రపక్షాలన్నీ దూరమవడంతో టీడీపీని బీజేపీ నేతలు దరిచేర్చుకుంటున్నారంటూ వివిధ రకాల విశ్లేషణలు వెలువడ్డాయి. వాస్తవానికి చంద్రబాబును ఎన్డీయేలోకి చేర్చుకోవడం నరేంద్రమోడీకి, అమిత్ షాకు ఇష్టం లేదని, ముఖ్యంగా షాకు సుతరామూ ఇష్టపడంలేదని బీజేపీలోని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.

ఉక్కపోతకు గురవుతున్న పార్టీలు
దేశవ్యాప్తంగా భవిష్యత్తులో తమకు పోటీ వస్తాయని భావించిన పార్టీని, వ్యక్తులను బీజేపీ అధిష్టానం ఉక్కపోతకు గురిచేస్తోంది. ప్రతిపక్షమైనా, మిత్రపక్షమైనా, ఏ పార్టీ అయినా, ఏ వ్యక్తి అయినా బీజేపీకి స్నేహహస్తం చాచాల్సిందే. లేదంటే మధ్యప్రదేశ్, గోవా, కర్ణాటక, మణిపూర్... రాష్ట్రాలతో సంబంధం లేకుండా, ప్రాంతాలతో సంబంధం లేకుండా కమలం ప్రభుత్వాలను ఏర్పడతాయి. తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో నేరుగా పొత్తులు పెట్టుకోవడమనేది పార్టీకి నష్టం చేస్తుందని బిజెపి థింక్ ట్యాంక్ యోచిస్తోంది. టీడీపీ, బీజేపీ బంధాన్ని గత కాంగ్రెస్- టీడీపీ బంధంతో ముడిపెట్టి.... సెంటిమెంటు డ్రామాతో గట్టెక్కే యోచనలో కేసీఆర్ ఉన్నారని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి.

మోడీ-షా మంత్రాంగం.. అద్భుతం
జూనియర్ ఎన్టీఆర్ ను దువ్వడం ద్వారా చంద్రబాబు నాయుడుకు హెచ్చరికలు పంపించడమే మోడీ-షాల మంత్రాంగం ఉద్దేశం. రెండు తెలుగురాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరుల్లో అయోమయం సృష్టించడమే రామోజీరావు, జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా మంతనాల్లోని మర్మం. జరుగుతున్న చర్చలు, వెల్లువెత్తుతున్న భిన్నాభిప్రాయాలే షా మంత్రాంగం ఎంత బ్రహ్మాండంగా వర్కవుట్ అయిందో తెలియజేస్తోంది.

తమకు ఉపయుక్తంగా ఉంటుందనుకుంటేనే?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుతో బీజేపీకి ఉపయుక్తంగా ఉంటుందంటేనే అటు పొత్తులు కానీ, ఇటు అవగాహన కానీ కుదురుతుంది. అయితే అవి ఉంటాయా? అంటే ఎవరూ చెప్పలేని పరిస్థితి. తెలిసినవారు ఇద్దరే మోడీ, షా. ప్రస్తుతం నలుగుతున్న రాజకీయమంతా ప్రత్యర్థులను అయోమయానికి గురి చేసే వ్యూహంలో భాగమే. తెలుగుదేశం శ్రేణులు బీజేపీ స్నేహ హస్తంపై ఆశలు పెంచుకోవాల్సిన అవసరం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ పార్టీ దృష్టి అంతా ప్రస్తుతం తెలంగాణపై కేంద్రీకృతమై ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఫలితాలను బట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎలాంటి అడుగులు వేయాలో మోడీ, షా ద్వయం నిర్ణయిస్తుంది. అప్పటివరకు వేచిచూడటమే.












Click it and Unblock the Notifications