TDPపై నరేంద్రమోడీ, అమిత్ షా కన్నెర్ర చేయరా?
ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతోపాటు పలు జిల్లాలకు బీజేపీ అధ్యక్షులుగా చేసినవారు, కన్నా అనుచరులంతా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కన్నా తర్వాత విష్ణుకుమార్ రాజు, ఆదినారాయణరెడ్డి, కామినేని శ్రీనివాస్, వరదాపురం సూరి లాంటి నేతల పేర్లు కూడా వినపడుతున్నాయి. బీజేపీ నుంచి వలసలకు ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజు వైఖరి నచ్చకపోవడమే ప్రధాన కారణమని భావిస్తున్నారు. ఢిల్లీ వెళ్లిన అసంతృప్త నేతలతో బీజేపీ నేత మురళీధరన్ మాట్లాడారు.

బీజేపీ మొత్తంలో టీడీపీలో చేరుతున్నట్లుగా ఉంది
వాస్తవానికి ఇక్కడి పరిస్థితిని గమనిస్తే బీజేపీ మొత్తం టీడీపీలో చేరుతున్నట్లుగా వాతావరణం నెలకొంది. ఇంత జరుగుతున్నా భారతీయ జనతాపార్టీ అధిష్టానం ఏమీ పట్టనట్లుగా ఉంటోంది. బుధవారం విజయవాడలో సమావేశమవుదామనుకున్న అసమ్మతి నేతలను ఢిల్లీ పిలిపించారు.
అంతకుమించి ఒక్క అడుగు ముందుకు పడలేదు. భారతీయ జనతాపార్టీ నుంచి వలసల్ని ప్రోత్సహిస్తే సహించేది లేదని ఓ బీజేపీ నేత హెచ్చరికలు జారీచేశారు. అయితే ఆ హెచ్చరికలు ఢిల్లీ నుంచి వస్తే ఒకరకంగా ఉండేది. కానీ స్థానికంగా వచ్చింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రాబు బీజేపీ నుంచి వస్తున్న నేతలందరినీ పార్టీలో చేర్చుకుంటున్నారు.

కన్నెర్ర చేస్తే ఒక అడుగు వెనక్కు..
ప్రత్యేకంగా ఆకర్ష్ లాంటి ప్రయోగాలు కూడా ఏమీ చేయలేదు. సోము వీర్రాజు, జీవీఎల్ వైఖరి నచ్చనివారంతా ఆ పార్టీ నుంచి బయటకు వస్తున్నారు. వీరంతా తమకు మోడీ, షా అంటే ఎంతో గౌరవమని, కానీ స్థానికంగా నాయకత్వ వైఖరి నచ్చడంలేదని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పేస్తున్నారు. ఒకవేళ తమ నేతల్ని చేర్చుకుంటున్నారంటూ భారతీయ జనతాపార్టీ అధిష్టానం కన్నెర్ర చేస్తే తెలుగుదేశం పార్టీ ఒకడుగు వెనక్కి వేసేది.
వారు తలుచుకుంటే నేతలందరినీ పార్టీ మారకుండా ఆపగలరు. గతంలో వైసీపీలో చేరాలనుకున్న కన్నాను చివరి నిముషంలో వెళ్లనీయకుండా ఆపేశారు. ఈసారి మాత్రం పట్టించుకోలేదు. బీజేపీ వ్యూహం ఏమై ఉంటుందా? అనే చర్చ ఏపీలో నడుస్తోంది.

వివరాలన్నీ క్రోడీకరించిన తర్వాతే..
అసమ్మతి నేతలకు అధిష్టానం ఎటువంటి హామీ ఇచ్చింది? పార్టీ నుంచి వలస పోతున్న నాయకులకు సంబంధించి పార్టీ అధ్యక్షుడు ఏం చెబుతారు? ఎంతమంది నేతలు పార్టీ మారుతున్నారు? తదితర వివరాలన్నింటినీ అధిష్టానం క్రోడీకరించాల్సి ఉంటుంది.
ప్రత్యేకంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ అని పెట్టి ఎవరినీ బలవంతంగా పార్టీలోకి ఆహ్వానించలేదుకాబట్టి అధిష్టానం లైట్ తీసుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అసమ్మతి నేతలు చెప్పిన వివరాల ప్రకారం సోము వీర్రాజును అధ్యక్షుడిగా కొనసాగనిస్తారా? లేదంటే మారుస్తారా? అనేది తేలాల్సి ఉంది.












Click it and Unblock the Notifications