స్వాతిముత్యం, సాగర సంగమం కంటే 'పుష్ప' గొప్పదా?
మన తెలుగు భాషను గుర్తించి, వీళ్లు కూడా సినిమాలు చేస్తున్నారనే విషయాన్ని ప్రపంచానికి తెలియజెప్పాలని జాతీయ అవార్డుల కమిటీకి అనిపించిందో ఏమోకానీ... 69 సంవత్సరాల నుంచి దక్కని ఉత్తమ నటుడి అవార్డును 'పుష్ప' సినిమాలో నటనకు అల్లు అర్జున్ కు ప్రకటించింది. ఈ 69 సంవత్సరాల కాలంలో జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రాలను ఎంపిక చేయడానికి కమిటీ సభ్యులు అవలంబించిన విధివిధానాలు, ప్రాంతీయ వాదం, ప్రాంతీయ భాషా చిత్రాలపై శీతకన్ను లాంటివి దశాబ్దాల నుంచి చూస్తున్నదే.
కమిటీ సభ్యులకు ప్రాంతీయ తత్వం గుర్తుకురావడంతోపాటు ఉత్తరాది నుంచి, హిందీ నుంచి వచ్చే సినిమాలు, అందులో చేసే నటులే ఆర్టిస్టులనే భావనలో కమిటీ సభ్యులుండేవారు. స్వాతిముత్యం, సాగర సంగమం, శంకరాభరణం, మాయాబజార్, నర్తనశాల, దేవదాసు, మూగమనసులు, అల్లూరి సీతారామరాజు... ఇలా చెప్పుకుంటూ పోతే వెండి వెలుగుల తెలుగు తెరపై ఎన్నో మాయాజాలాలు.. మరెన్నో మనసును తట్టే భావాలకు చిత్రరూపాలు కనువిందు చేసేవి.

ప్రతి తెలుగువాడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన చిత్రాలుగా 'స్వాతిముత్యం', 'సాగర సంగమం' చిత్రాలను పేర్కొనవచ్చు. అందులోని నటనకు కమల్ హాసన్ మాత్రమే న్యాయం చేశారు. ఆస్కార్ అవార్డు కూడా ఈ నటన ముందు దిగదుడుపే. తెలుగు సినిమాను అవార్డులతో సత్కరించాలంటే జాతీయ అవార్డుల కమిటీకి ఎప్పుడూ చిన్నచూపే. ప్రపంచవ్యాప్తంగా ఆ రెండు సినిమాల్లో కమల్ హాసన్ కనపరిచిన నటనతో పోలిస్తే ఆస్కార్ అవార్డులు సాధిస్తున్న సినిమాల్లోని ఉత్తమ నటుల నటన కూడా దిగదుడుపే.
ఇప్పుడు కె.విశ్వనాథ్ లేరు. కానీ ఆయన చిత్రాలు అజరామరం. తెలుగు భాష జీవించి ఉన్నంతకాలం సజీవంగా ఉండిపోతాయి. ఈ తరం నటుల నుంచి ఉత్తమ నటనను రాబట్టుకునే దర్శకుల్లో రాజమౌళి, సుకుమార్ ముందుంటారు. ఆర్టిఫిషియల్ గా కాకుండా సహజంగా పాత్రలు ఉన్నప్పుడే ప్రేక్షకులను ఆకట్టుకోగలుగుతామనే కోణంలోనే సుకుమార్ తన సినిమాలను తెరకెక్కిస్తుంటారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాలో అల్లు అర్జున్ నటన, హావభావాలు, వేషధారణ.. అన్నీ ప్రేక్షకులకు ఒక కొత్త లోకాన్ని పరిచయం చేస్తాయి. స్వాతిముత్యం, సాగరసంగమం సినిమాలకంటే పుష్ప సినిమా గొప్పదేం కాదు.. ఆ విషయం ఆ చిత్ర బృందానికి కూడా తెలుసు. కానీ తెలుగు గడ్డకు జాతీయ అవార్డును సాధించిపెట్టిన చిత్రంగా పుష్పను కూడా మనం గుండెల్లో పెట్టుకోవాల్సిందే.












Click it and Unblock the Notifications