గంజాయి సాగు నక్సల్స్ ఆదాయ వనరు: డీజీపీ గౌతమ్ సవాంగ్ కీలక వ్యాఖ్యలు, పవన్ కళ్యాణ్ ఇలా
అమరావతి: ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గంజాయి సాగు వెనుక నక్సల్స్ పాత్ర ఉందన్నారు. ముంద్రా పోర్టు డ్రగ్స్‌కు, ఏపీకి సంబంధం లేదని మరోసారి స్పష్టం చేశారు. ఈ విషయాన్ని పదే పదే చెబుతున్నా విపక్షాలు అవాస్తవాలు ప్రచారం చేయడం సరికాదన్నారు.

ఏపీలో డ్రగ్స్ లేదు.. గంజాయి సాగే: డీజీపీ
ఏపీలో డ్రగ్స్ లేవని, కేవలం గంజాయి సాగు మాత్రమే జరుగుతోందని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. గంజాయి నివారణకు ఏడు రాష్ట్రాల అధికారులతో చర్చించామన్నారు. ఈ భేటీలో డీఆర్ఐ, ఎన్సీబీ, ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారని తెలిపారు. గంజాయి నివారణకు ప్రణాలికా బద్ధంగా ముందుకెళ్తున్నామని డీజీపీ తెలిపారు.

గంజాయి సాగు నక్సల్స్ ఆదాయ వనరే: ఏపీ డీజీపీ
గంజాయి సమూల నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని, పూర్తి నిఘాతో గంజాయిని అరికట్టడమే తమ లక్ష్యంగా పనిచేస్తున్నామని డీజీపీ సవాంగ్ తెలిపారు. సాగు నుంచి రవాణా వరకు సమగ్ర నివేదిక తయారుచేస్తున్నామని చెప్పారు. గంజాయి సాగు, రవాణా వెనుక నక్సల్స్ పాత్ర ఎక్కువగా ఉందని, అది వారి ఆదాయ వనరుగా మారిందని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. గిరిజనులే నకల్స్‌ను దగ్గరకు రానివ్వడం లేదని చెప్పారు. ఈ అవకాశాన్ని వాడుకుని గంజాయి సాగు నివారణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

పోలీసులకు అధికారమివ్వాలంటూ పవన్ కళ్యాణ్
మరోసారి డ్రగ్స్, గంజాయిపై సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. విశాఖ అర్బన్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గంజాయి సాగును కట్టడి చేసేందుకు ఏపీ పోలీసులకు పూర్తి అధికారం, చేసే పరిస్థితులు ఇవ్వండి.. 48 గంటల్లో కట్టడి చేస్తారన్నారు. కానీ, ఈ ప్రభుత్వం వారికి అధికారాలు ఇవ్వదని మండిపడ్డారు. ఇక, రోడ్ల దుస్థితిపై ఎలా ఉద్యమించామో అలాగే ఏపీలో గంజాయి సాగు, స్మగ్లింగ్ గురించి అదే విధంగా జనసేన ఉద్యమిస్తుందన్నారు పవన్ కళ్యాణ్.
Recommended Video

ఆర్యన్ ఖాన్ వ్యవహారం అలా.. ఏపీలో ఇలా.. : పవన్ కళ్యాణ్
ఇక, విశాఖ మన్యంలో రూ.4 వేల కోట్ల గంజాయి సాగు అవుతోందంటూ ఆరోపణలు చేశారు పవన్ కళ్యాణ్. అలా ఏం జరగడం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే.. అఖిల పక్షం తీసుకువెళ్ళండి.. ఉంటే అందరం కలిసే ధ్వంసం చేద్దామన్నారు.లేదంటే ఆ రూ.4 వేల కోట్ల గంజాయి దేశంలోకి వచ్చేస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు.. షారుఖ్ ఖాన్ కుమారుడి వ్యవహారంపై స్పందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ దగ్గర డ్రగ్స్ ఉందో లేదో తెలియదు.. కానీ, కేసులు నమోదు చేశారు. మరి ఇన్ని వేల కోట్ల గంజాయి ఉన్న చోట ఎంత బలంగా చట్టం పనిచేయాలి..? అని పవన్ ప్రశ్నించారు. రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ ఉపయోగించుకొని ఎక్కడ గంజాయి సాగు అవుతుందనేది కనిపెట్టలేరా? అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు జనసేనాని.












Click it and Unblock the Notifications