జగన్ కేసులో షర్మిలకు ట్రిబ్యునల్ కీలక ఆదేశాలు..!!
జగన్ - షర్మిల ఆస్తుల కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అన్న జగన్ తో రాజకీయంగా విభేదించిన సమయం నుంచి ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగింది. తండ్రి నుంచి వచ్చిన ఆస్తులు.. స్వార్జితంగా సంపాదించిన వాటి వరకు ఇద్దరి మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. సరస్వతి పవర్ షేర్లను షర్మిల విక్రయించటంతో జగన్ ఎన్సీఎల్టీని ఆశ్రయించారు. తల్లి, చెల్లి పైన పిటీషన్ దాఖలు చేసారు. ఈ కేసు విచారణకు స్వీకరించిన ఎన్సీఎల్టీ తాజాగా షర్మిలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును డిసెంబర్ 13కి వాయిదా వేస్తూ నిర్ణయం ప్రకటించింది.
జగన్ పిటీషన్ తో
జగన్ - షర్మిల ఆస్తుల వివాదం ఎన్సీఎల్టీకి చేరింది. ఇద్దరి మధ్య ఆస్తుల పంచాయితీ సోషల్ మీడియాతో పాటుగా రాజకీయ రచ్చగా మారింది. షర్మిల - జగన్ మధ్య ఆస్తుల వివాదం పైన చోటు చేసుకున్న లేఖలు బయటకు వచ్చాయి. జగన్ ప్రత్యర్థి పార్టీలు ఈ లేఖల తో రాజకీయంగా తీవ్ర ఆరోపణలు చేసారు. జగన్ ఇలాంటి అంశాలు ప్రతీ ఇంటా ఉండేవే అంటూ వ్యాఖ్యానించారు.
జగన్ తన పైన విచారణలో ఉన్న కేసుల్లో భాగంగా ఈడీ అటాచ్ చేసిన సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ షేర్లను అక్రమంగా బదిలీ చేశారని ఆరోపిస్తూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)ని ఆశ్రయించారు. జగన్ -షర్మిల మధ్య 2019 లో జరిగిన ఒప్పందానికి భిన్నంగా తన సోదరి వ్యవహరించారని పిటీషన్ లో పేర్కొన్నారు.

ఎంఓయూ ఉల్లంఘన
అదే సమయంలో తన తండ్రి నుంచి వచ్చిన ఆస్తులు కాకుండా.. ఇప్పటి వరకు తన స్వార్జితం నుంచి రెండు వందల కోట్లు షర్మిలకు ఇచ్చినట్లుగా జగన్ తన చెల్లికి రాసిన లేఖలో పేర్కొన్నారు. తన బెయిల్ కండీషన్లకు భిన్నంగా షేర్లు విక్రయించటం ద్వారా జగన్ కు నష్టం చేసే విధంగా షర్మిల వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే, షర్మిల మాత్రం తనకు రావాల్సినదే తన అన్న ఇచ్చారని.. తన తండ్రి ఆస్తులు పంపకాలు చేయలేదని వెల్లడించారు. ఆ తరువాత విజయమ్మ సైతం ఇదే అంశాన్ని నిర్ధారించారు. ఇక.. జగన్ తాను ప్రేమతో రాసిన ఆస్తులు .. షేర్లు ఇప్పుడు ఇక షర్మిలకు దక్కవని.. తన వ్యవహార శైలిలో మార్పులు వస్తే ఆలోచన చేస్తానంటూ తేల్చి చెప్పారు. ఎన్సీఎల్టీలో దాఖలు చేసిన పిటీషన్ లోనూ ఇదే అంశాన్ని స్పష్టం చేసారు.
షర్మిల కు ఆదేశాలు
ఎన్సీఎల్టీలో జగన్ - భారతి దాఖలు చేసిన పిటీషన్ లో సరైన చట్టపరమైన విధానాలు లేకుండా 2024 జూలైలో బహుళ వాటా బదిలీలు జరిగాయని ఆరోపించారు. షేర్ల బదిలీని రద్దు చేయాలని వారు అభ్యర్థించారు. తాము చేసుకున్న ఎంఓయూకు భిన్నంగా షర్మిల వ్యవహరించటమే ఈ పిటీషన్ కు కారణంగా వైసీపీ నేతలు వివరించారు. ఇక, విజయమ్మ తాజాగా ఈ వివాదం జగన్ - షర్మిల పరిష్కరించుకుంటారని చెప్పుకొచ్చారు. జగన్ దాఖలు చేసిన పిటీషన్ పైన నేడు విచారణ చేసిన ఎన్సీఎల్టీ దీని పైన కౌంటర్ దాఖలు చేయాలని షర్మిలను ఆదేశిస్తూ డిసెంబర్ 13వ తేదికి తదుపరి విచారణ కోసం వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications