వైసీపీ కంచుకోటల్లో కూటమి మైండ్ గేమ్-మరో ఏడాది తప్పదా?
ఏపీలో తాజాగా అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ రాష్ట్రంలో స్థానిక సంస్థలపై పట్టు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఒక్కో స్థానిక సంస్ధలో వైసీపీ నుంచి తమ పార్టీల్లోకి ప్రజా ప్రతినిధుల వలసల్ని ప్రోత్సహిస్తోంది. దీంతో అనధికారికంగా వాటిపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తోంది. కానీ అధికారికంగా వాటి పగ్గాలు మాత్రం ఇప్పట్లో కూటమికి అందే పరిస్ధితి లేదు. దీని వెనుక ఓ కీలక కారణం ఉంది.
రాష్ట్రంలో ఐదేళ్లుగా అధికారంలో ఉన్న వైసీపీ సర్కార్ ఫిరాయింపులకు అడ్డుకట్ట వేసేందుకు వీలుగా ఓ చట్టం చేసింది. దీని ప్రకారం స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారు ఫిరాయింపులకు పాల్పడినా అధికార పగ్గాలు మాత్రం వెంటనే చేజిక్కించుకునే పరిస్ధితి ఉండదు. కార్పోరేషన్లు, మున్సిపాలిటీలు, మెజర్ పంచాయతీల్లో పీఠాలపై ఉన్న వారిని అడ్డగోలుగా తప్పించేందుకు వీల్లేదు. ఇప్పుడు ఈ నిబంధనే కూటమికి అడ్డంకిగా మారింది. ఓసారి ఎన్నికయ్యాక నాలుగేళ్ల పాటు అమల్లో ఉండే ఈ నిబంధన గడువు వచ్చే ఏడాది ముగియనుంది. అప్పటివరకూ అధికార పీఠాల్ని కదిపే అవకాశం లేదు.

మరోవైపు రాష్ట్రంలో స్దానిక సంస్థలపై పట్టు సంపాదించకుండా అభివృద్ధి పనులు చేపడితే వైసీపీకే ప్రయోజనం కలుగుతుంది. రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా అలా విపక్షంలో వైసీపీకి ప్రయోజనం చేకూర్చేందుకు కూటమి సర్కార్ ఇష్టపడటం లేదు. దీంతో మైండ్ గేమ్ మొదలుపెట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఆయా పట్టణ స్థానిక సంస్థల్లో మెజార్టీ ప్రజాప్రతినిధుల్ని తమవైపుకు తిప్పుకోవడం ద్వారా అధికార పీఠాల్ని బలహీనం చేసి తద్వారా తమకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తోంది.
దీంతో మేయర్లు, డిప్యూటీ మేయర్లు, ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లు వైసీపీ వారే అయినా మెజార్టీ ప్రజాప్రతినిధులు మాత్రం తమవైపు తిప్పుకుంటే చాలన, వచ్చే ఏడాది కల్లా ఎలాగో అధికార పీఠాలు చేజిక్కించుకోవచ్చని కూటమి భావిస్తోంది.












Click it and Unblock the Notifications