ఎన్నికల ఏజెంట్లుగా వాలంటీర్లు - సీన్ రివర్స్...!!
ఏపీలో మరోసారి వాలంటీర్ల వ్యవహారం కీలకంగా మారుతోంది. వాలంటీర్లను పెన్షన్ల పంపిణీ నుంచి ఎన్నికల సంఘం దూరం పెట్టింది. ఆ సమయంలో రాజకీయంగా దుమారం చెలరేగింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 40 వేలకు పైగా వాలంటీర్లు రాజీనామా చేసారు. వాలంటీర్ల విషయంలో ఎన్నికల ప్రచారంలోనూ ప్రస్తావనకు వస్తోంది. ఈ సమయంలోనే వాలంటీర్లను ఎన్నికల ఏజెంట్లుగా కూర్చొనేందుకు అనుమతి ఇవ్వద్దంటూ ఎన్డీఏ నేతలు ఎన్నికల సీఈవోను కోరారు.
ఏజెంట్లుగా వాలంటీర్లు
వాలంటీర్ల గురించి ఎన్నికల సంఘానికి మరో ఫిర్యాదు అందింది. మే 1వ తేదీన అందించే పెన్షన్ల విషయంలో ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎన్నికల సీఈవోను ఎన్డీఏ నేతలు కోరారు. గత నెల 1వ తేదీన వాలంటీర్లను తప్పించటంతో పెన్షన్ల అంశం ఎన్నికల వేళ రాజకీయ వివాదంగా మారింది. ఈ సారి అలాంటి పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని నేతలు సూచించారు. ఎన్నికల సమయం లో రాష్ట్ర వ్యాప్తంగా 40 వేల మందికి పైగా వాలంటీర్లు రాజీనామా చేసారు. దీంతో, తాను అధికారంలోకి వచ్చిన తరువాత వాలంటీర్ల వ్యవస్థ పైనే తొలి సంతకం చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ల వేతనం రూ 10 వేలకు పెంచుతానని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

సీఈవోకు ఫిర్యాదు
ఇక, వాలంటీర్లను ఎన్నికల ఏజెంట్లుగా కూర్చోనీయద్దని ఎన్డీఏ నేతలు కోరారు. ఎన్నికల విధులకు ఇప్పటికే వాలంటీర్లు దూరంగా ఉంటున్నారు. రాజీనామా చేసిన వాలంటీర్లు ఎన్నికల ఏజెంట్లుగా కూర్చొనే అవకాశం ఉందనే చర్చ రాజకీయంగా కొనసాగుతోంది. అటు వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించవద్దంటూ హైకోర్టులో దాఖలైన పిటీషన్ పైన విచారణ సాగుతోంది. రాజీనామా చేయటంతో తాము ఎలాంటి బాధ్యతలు నిర్వహించటం లేదనేది వాలంటీర్ల వాదన. అయితే, అయిదేళ్ల కాలంగా తమకు కేటాయించిన వార్డుల్లో ప్రజలతో మమేకం అయ్యారు. వారిని ఏజెంట్లుగా కూర్చోబెడితే పోలింగ్ పైన ప్రభావం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీంతో ఎన్డీఏ నేతలు తాజా ఫిర్యాదు చేసారు.
నిర్ణయం పై ఉత్కంఠ
ఇంకా విధుల్లో ఉన్న వాలంటీర్లు ఎన్నికల ఏజెంట్లుగా పని చేసే అవకాశం లేదు. రాజీనామా చేసిన వాలంటీర్ల విషయంలో వారించటం సాధ్యమా అనే చర్చ సాగుతోంది. నెల రోజుల కాలంలోనే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వాలంటీర్లు వరుసగా రాజీనామాలు చేసారు. కొందరు టీడీపీలోనూ చేరారు. దీంతో..ఇప్పుడు వాలంటీర్లను పోలింగ్ ఏజెంట్లుగా నియమించటం పైన ఎన్నికల సంఘం నిర్ణయం కీలకం కానుంది. అదే విధంగా మే 1న పంపిణీ చేయాల్సిన పెన్షన్ల విషయంలో అధికార యంత్రాంగం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందీ...ఎన్నికల సంఘం ఏ రకమైన సూచనలు చేస్తుందనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications