పవన్ ఫిక్స్: చంద్రబాబుతో కీలక భేటీ - అక్కడే ఫైనల్..!!
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. స్థానిక ఎన్నికల వేళ కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. ఈ నెలాఖరు లోగా స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. దీంతో, కూటమి- వైసీపీ ఈ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. రెండు వైపులా గెలుపు ప్రతిష్టాత్మకం గా తీసుకుంటున్నాయి. ఇదే సమయంలో ఈ ఎన్నికల పైన పవన్ లెక్క స్పష్టంగా ఉంది. ఇక, సీఎం చంద్రబాబుతో పవన్ భేటీకి ముహూర్తం ఖరారైంది. అక్కడే ఫైనల్ నిర్ణయం రానుంది.
స్థానిక ఎన్నికల విషయంలో జనసేన ఈ సారి కొంత గట్టిగానే పట్టుబడుతోంది. 2024 ఎన్నికల సమయంలో 21 సీట్లకు పరిమితమైన జనసేన స్థానిక ఎన్నికల్లో నాటి ఫార్ములా అమలు కాదని జనసేన నేతలు తేల్చి చెబుతున్నారు. పవన్ సైతం జనసేన కార్యకర్తల గౌరవానికి తగ్గకుండా సీట్ల పైన నిర్ణయం ఉంటుందని స్పష్టం చేసారు. తమకు బలం ఉన్న చోట పోటీ చేస్తామని జనసేన నేతలు పదే పదే చెబుతున్నారు. క్షేత్ర స్థాయిలోనూ జనసేనలో సీట్ల కోసం పోటీ పెరుగుతోంది. లోకల్ బాడీ ఎన్నికల్లో మూడు పార్టీల కేడర్ నుంచి వస్తున్న ఒత్తిడితో సీట్ల పంపకాలు కీలకంగా మారుతున్నాయి. జనసేన విజయవాడ, తిరుపతి, ఒంగోలు, కాకినాడ మేయర్ సీట్లతో పాటుగా పలు మున్సిపల్ చైర్మన్ సీట్ల పైన ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు ప్రతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లో మున్సిపాల్టీలను కోరుతోంది.

మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు
అదే విధంగా జెడ్పీ ఛైర్మన్ల కోసం ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర తో పాటుగా తిరుపతి- అన్నమయ్య జిల్లాల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. దీంతో.. తాజాగా పార్టీ నేతల సమావేశంలో జనసేన నేత మనోహర్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ నెల 15న పవన్ వస్తారని.. స్థానిక సంస్థల ఎన్నికల మీద సమీక్షలు నిర్వహిస్తారు అని చెప్పారు. పార్టీ ప్రతిపాదనల పైన ముఖ్య నేతలతో చర్చించిన తరువాత ఈ నెల 16న సీఎం చంద్రబాబుతో పవన్, మాధవ్ సమావేశం ఉంటుందని చెబుతున్నారు. ఆ సమావేశంలో పవన్ తమ పార్టీ నుంచి ప్రతిపాదిత స్థానాల పైన చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. పవన్, బీజేపీ ప్రతిపాదనల పైన సీఎం చంద్రబాబు పరిశీలన చేసి.. తదుపరి సమావేశంలో స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే.. మూడు పార్టీలు ఏ శాతం మేర పోటీకి అంగీకరిస్తాయి.... ఎవరు ఏ స్థానంలో పోటీ చేస్తారనేది ఈ నెల మూడో వారంలో గా ఖరారు చేయాలని భావిస్తున్న వేళ... సీట్ల సర్దుబాటు పైన ఆసక్తి నెలకొంది.













Click it and Unblock the Notifications
