తమిళనాడులో ప్రధాన ఆకర్షణగా నారా లోకేష్
Nara Lokesh: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్.. తమిళనాడు ఎన్నికల్లో ప్రధాన ఆకర్షణగా మారారు. మిత్రపక్షం భారతీయ జనతా పార్టీ తరఫున అక్కడ విస్తృతంగా ప్రచారం చేస్తోన్నారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించాలంటూ రోడ్ షోలను నిర్వహిస్తోన్నారు.
తెలుగు ప్రజలు ఎక్కువగా నివసించే కోయంబత్తూరు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో గురువారం రాత్రి ఆయన బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు. తెలుగులో ప్రసంగించారు. బీజేపీ తమిళనాడు రాష్ట్రశాఖ అధ్యక్షుడు కే అన్నామలై.. ఇక్కడి నుంచి లోక్‌సభ పోటీ చేస్తోన్నారు. ఆయనకు మద్దతుగా నారా లోకేష్ సుడిగాలి పర్యటనలను చేపట్టారు.

రాష్ట్రవ్యాప్తంగా అన్నామలై పాదయాత్ర చేశారని, గ్రామస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటోన్న సమస్యలన్నింటినీ స్వయంగా తెలుసుకున్నారని నారా లోకేష్ పేర్కొన్నారు. యువకులు, నిరుద్యోగులు, నిరుపేద కుటుంబాలు, రైతులు ఎదుర్కొంటోన్న సమస్యలపై అన్నామలైకి సంపూర్ణ అవగాహన ఉందని, వాటిని ఎలా పరిష్కరించాలో ఆయనకు తెలుసునని అన్నారు.
సమాజంలో మార్పును తీసుకుని రావాలని బలంగా కోరుకుంటోన్న వ్యక్తిగా అన్నామలైని అభివర్ణించారాయన. ఈ ఎన్నికల్లో ఆయనకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. తమిళనాడు ప్రజలకు వచ్చి సేవ చేయాలనే ఉద్దేశంతో తన ఐపీఎస్ సర్వీసులను వదిలిపెట్టా రాజకీయాల్లోకి వచ్చారని, ఈ ఎన్నికల్లో అన్నామలై ఖచ్చితంగా గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.

బలమైన దేశం కావాలంటే బలమైన రాష్ట్రాలు ఉండాల్సిన అవసరం ఉందని, తమిళనాడు- ఏపీ కలిసి బలమైన దేశాన్ని నిర్మించగలవని అన్నారు. ఏపీ- తమిళనాడు మధ్య ఎంతోకాలంగా సత్సంబంధాలు ఉన్నాయని, అన్ని రంగాల్లోనూ పరస్పరం సహకరించుకుంటోన్నాయని చెప్పారు.
కేంద్రంలో ఎన్డీఏ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని, 400కు పైగా లోక్‌సభ స్థానాలను గెలుచుకుంటుందని నారా లోకేష్ జోస్యం చెప్పారు. ఏపీ ఎన్నికల్లో టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి గెలవబోతోందని, వార్ వన్ సైడ్ అయిందని నారా లోకేష్ చెప్పారు. ఎవరికి ఓటు వేయాలో ఇప్పటికే అక్కడి ప్రజలు నిర్ణయం తీసుకున్నారని, దీన్ని ఎవరూ మార్చలేరని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications