రోజా మాట ఇస్తే తగ్గేదేలే..!!
RK Roja:మాజీ మంత్రి రోజా... వైసీపీ ఫైర్ బ్రాండ్‌గా పిలుస్తుంటారు.ఒక ప్రెస్‌మీట్ పెట్టారంటే అధికార పక్షం కళ్లన్నీ ఆమె వైపే ఉంటాయి. ప్రభుత్వ పనితీరుపై ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ హడలెత్తిస్తుంటారు. అయితే ఇదంతా నాణానికి ఒక వైపు మాత్రమే. రోజా మరోవైపు ఎలాగుంటారన్న విషయం తన సన్నిహితులకు, చాలా దగ్గరి వారికి, ఆమె నియోజకవర్గ ప్రజలకు మాత్రమే తెలుసు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడూ లైమ్‌లైట్‌లో ఉండే రోజా ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అదే సమయంలో ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ఎప్పుడూ ఆమె ముందుంటారు. కొన్నేళ్ల క్రితం పుష్ప కుమారి అనే పేద విద్యార్థినిని దత్తత తీసుకుని ఆమె చదువకు కావాల్సిన ఆర్థిక సహకారాన్ని అందించారు. తాజాగా ఈ జాబితాలో మరో విద్యార్థిని చేరింది.
జయశ్రీ బాధ్యత తీసుకున్న రోజా
వైసీపీ ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి రోజా మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ సారి మరో చదువుల సరస్వతికి అండగా నిలవాలని నిర్ణయించారు. తన నియోజకవర్గం విజయపురం మండలం ఆలపాకం గ్రామానికి చెందిన రంగనాథ రెడ్డి కూతురు అయిన జయశ్రీ అనే విద్యార్థిని తాజాగా విడుదలైన నీట్ పరీక్ష ఫలితాల్లో 95.86శాతంతో 471 మార్కులు సాధించింది. విషయం తెలుసుకున్న రోజా జయశ్రీని అభినందించారు. అంతేకాదు ఆమె మెడిసిన్ పూర్తి చేసేందుకు అయ్యే ఖర్చు అంతా తానే భరిస్తానని మాట ఇచ్చారు. ఈ రోజుల్లో మెడిసిన్ చదవాలంటే అయ్యే ఖర్చును తలచుకుంటేనే గుండె జారిపోతుంది. అలాంటిది రోజా నోటి వెంట ఈ మాట రాగానే జయశ్రీ, ఆమె తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

అంతేకాదు జయశ్రీ ఇంటర్మీడియట్ చదువకు అయిన ఖర్చును కూడా రోజానే చెల్లించారు. జయశ్రీ తిరుపతి చైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసింది. ఆ తర్వాత మెడిసిన్ చదవాలన్న తన కలను సాకారం చేసుకునేందుకు నీట్ కోసం కష్టపడి చదివింది. అనుకున్న ఫలితం రావడంతో ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. అయితే మెడిసిన్‌కు అయ్యే ఖర్చు గురించి దిగులు పడుతున్న సమయంలో రోజా భరోసా ఇవ్వడంతో ఆమె దేవతలా తమ కుటుంబాన్ని ఆదుకుందని ఆనందం వ్యక్తం చేస్తోంది రంగనాథ రెడ్డి కుటుంబం.
నాడు పుష్పకుమారిని దత్తత..
ఇక 2020లో పుష్పకుమారి అనే విద్యార్థినిని మాజీ సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించిన రోజా ఆమె చదువుకయ్యే ఖర్చులన్నీ తానే భరిస్తానని హామీ ఇచ్చారు. డాక్టర్ అవ్వాలనే పుష్పకుమారి కలను త్వరలో సాకారం చేయనున్నారు రోజా. రోజా చేసిన మంచిపని పట్ల అప్పట్లో సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తాయి.2021 నీట్‌లో పుష్పకుమారి 89శాతం మార్కులతో ర్యాంక్ సాధించింది.బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోయినప్పటికీ డాక్టర్ కావాలనే తన ఆశయాన్ని వదులుకోలేదని, దాని సాధించిందని రోజా కొనియాడారు.ఇక నగరి నియోజకవర్గంలో ప్రతి బుధవారం గర్భిణీ స్త్రీల కోసం మంచి పౌష్టికాహారాన్ని అందించే కార్యక్రమం కూడా రోజా చేపడుతున్నారు.

రోజా అంటే ఫైర్ బ్రాండ్ అని మాత్రమే తెలిసిన వారు..ఆడపిల్లల చదువుల పట్ల తీసుకున్న బాధ్యతను, సమాజంలో ఒక గొప్ప డాక్టర్లుగా వారిని నిలపాలనే రోజా అంకితభావానికి సెల్యూట్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు.












Click it and Unblock the Notifications