Nellore Lok Sabha Election 2024 Results LIVE: నెల్లూరు పెద్దారెడ్డి ఎవరు?
నెల్లూరు లోక్‌సభ ఎన్నికల 2024 ఫలితాలు ప్రత్యక్ష ప్రసారం: ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు 25 లోక్ సభ నియోజక వర్గాలకు ఒకేసారి పోలింగ్ జరిగింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అందరికి ఎంత టెన్షన్ ఉందో కొన్ని లోక్ సభ నియోజక వర్గాల్లో కూడా అంతే టెన్షన్ ఉంది. నెల్లూరు పార్లమెంట్ నియోజక వర్గం ఎవరి ఖాతాలో పడుతోందో అంటూ ప్రజలు చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఎందుకంటే నెల్లూరులో అలాంటి వ్యక్తులు పోటీ చేశారు.
2024 లోక్ సభ ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంట్ నియోజక వర్గం నుంచి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వైసీపీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డి పోటీ చేశారు. ఇదే సమయంలో ఆ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కొప్పల రాజు పోటీ చేశారు. నెల్లూరుకు చాలా ప్రత్యేకతలు ఉన్న విషయం తెలిసిందే. నెల్లూరు పార్లమెంట్ నియోజక వర్గంలో రెడ్డి వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. అయితే టీడీపీ, వైసీపీ అభ్యర్థులు ఇద్దరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే కావడం ఇక్కడ ప్రత్యేకత.

రెడ్డి సామాజిక వర్గం ఓట్లు చీలిపోతే మిగిలిన సామాజిక వర్గం ఓటర్లు ఎవరిని ఆధరించారు అని అంతు చిక్కడం లేదు. నెల్లూరు పార్లమెంట్ నియోజక వర్గంలోని అసెంబ్లీ నియోజక వర్గాల్లోని ప్రజలు నాడి తెలీక ఎంపీలుగా పోటీ చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, విజయసాయి రెడ్డి గెలుపు అంచనాలు, మెజారిటీ విషయంలో ఓ అంచనాకు రాలేకపోతున్నారని తెలిసింది. ఇక రెండు పార్టీల నాయకులు కూడా అలాగే ఉన్నారు.
ఎన్నికల ప్రచారం సమయంలో విజయసాయి రెడ్డి మైక్ తీసుకుని మాట్లాడుతున్న సమయంలో అక్కడ ఉన్న ప్రజలు అందరూ వెనుతిరిగి వెళ్లిపోయారు. ఆ సందర్బంలో బహిరంగంగా అమ్మా, మన పెద్దాయన మాట్లాడుతున్నారు. దయచేసి అందరూ వెనక్కి రండి, మీటింగ్ అయిపోయిన తరువాత అందరికి భోజనాలు కూడా ఏర్పాటు చేశారు అని మైక్ లో పదేపదే మొత్తుకున్నా ప్రజలు మాత్రం వెనక్కి తిరిగి చూడకుండా ఇళ్లకు వెళ్లిపోయారు.
ఆ సందర్బంలో మైక్ లో వైసీపీ నాయకులు ఓటర్లను ప్రాదేయపడుతున్న వీడియోను టీడీపీ నాయకులు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. నెల్లూరు పార్లమెంట్ నియోజక వర్గంలో ఆనం వర్గం టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విజయం సాధించాలని చాలా కష్టపడి పని చేశారని నెల్లూరులోని ఓ వర్గం ప్రజలు అంటున్నారు. ఇదే సమయంలో వైసీపీ నెంబర్ టూ విజయసాయి రెడ్డిని గెలిపించుకోవడానికి వైసీపీ నాయకులు కూడా చాలా కష్టపడి పని చేశారు.
గతంలో వైసీపీ ఎంపీగా విజయం సాధించిన ఆదాల ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులకు మరో చాన్స్ రాలేదు. ఈసారి వైఎస్ జగన్ విజయసాయి రెడ్డికి నెల్లూరు టిక్కెట్ ఇచ్చి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. మొత్తం మీద నెల్లూరు సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని వైసీపీ అనేక ప్రయత్నాలు చేసింది. 1999లో నెల్లూరులో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఉక్కాల రాజేశ్వరమ్మ ఎంపీగా విజయం సాధించారు.
ఆతరువాత నెల్లూరు ఎంపీగా ఏ టీడీపీ అభ్యర్థికూడా విజయం సాధించలేదు. 20 ఏళ్ల తరువాత నెల్లూరులో టీడీపీ జెండా ఎగరవేయాలని ఆ పార్టీ నాయకులు అనేక ప్రయత్నాలు చేశారు. అయితే నెల్లూరు పార్లమెంట్ నియోజక వర్గం ప్రజలు ఎవరిని ఆధరించారు అనే విషయం మాత్రం ఇంకా పక్కాగా బయటకురాలేదు. ఓట్ల లెక్కింపు తరువాత ఇద్దరు రెడ్లలో ఏ రెడ్డి గెలుస్తారు, నెల్లూరు పెద్దారెడ్డి ఎవరు ? అనే విషయంలో క్లారిటీ వస్తుంది.












Click it and Unblock the Notifications