వారి ఖాతాల్లో రూ. 25వేలు జమ.. చీరాలలో నేతన్న సేవలో ప్రారంభించిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చీరాలలో 'నేతన్న సేవలో' కార్యక్రమాన్ని ప్రారంభించారు. చేనేతల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెబుతూ బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలోని కొత్తపేట వేదికగా ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు. దీని ద్వారా అర్హులైన 71,536 చేనేత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25,000 చొప్పున మొత్తం రూ.179 కోట్ల ఆర్థిక సహాయం అందించారు.
నేత కార్మికుల ఖాతాలలో 25 వేలు జమ, నేతన్న సేవలో ప్రారంభించిన సీఎం
అర్హులైన చేనేత కార్మికుల ఖాతాలలో 25 వేల రూపాయలను జమ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రజావేదిక బహిరంగసభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ చేనేత కార్మికుల సంక్షేమం తమ ప్రభుత్వ ప్రాధాన్యత అన్నారు. వారి ఆర్థికపురోగతి కోసం పథకం నిబంధనలలో కీలకమార్పులు చేశామని వివరించారు. గతంలో ఉన్న పరిమితులను తొలగించి, వయసు లేదా ఇంట్లో ఉన్న మగ్గాల సంఖ్యతో సంబంధం లేకుండా కుటుంబాన్ని ప్రాతిపదికగా తీసుకొని ఈ పథకాన్ని అందిస్తున్నామన్నారు.

సొంత మగ్గం ఉంటే ఏడాదికి 25 వేల రూపాయలు ఇస్తాం : సీఎం చంద్రబాబు
సొంత మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి 25 వేల రూపాయల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ సహాయం నేరుగా వారి ఖాతాలోనే జమ అవుతుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. చేనేత రంగంతో అనుబంధం ఉన్న చీరాల ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం ఒక విశేషంగా భావిస్తున్నానని సీఎం చంద్రబాబు అన్నారు.
నేత కార్మికుల కష్టాలు తనకు తెలుసన్న చంద్రబాబు
గత ప్రభుత్వ హయాంలో నేత కార్మికులు ఎదుర్కొన్న కష్టాలను ఆయన గుర్తుచేసుకున్నారు. వారి సంక్షేమానికి, ఆర్థిక అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. చేనేత రంగం రాష్ట్ర సంస్కృతికి, ఆర్థిక వ్యవస్థకు కీలకమని, చేనేత కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం ప్రభుత్వ బాధ్యత కనీసం చంద్రబాబు అన్నారు. నాణ్యమైన వస్త్రాలను ఉత్పత్తి చేయడంలో నేత కార్మికుల అసాధారణ నైపుణ్యాన్ని చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించి కొనియాడారు.
ఈ స్కీమ్ తో చేనేత కుటుంబాలకు ప్రత్యక్ష ఆర్థిక ప్రయోజనం
సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఈ కార్యక్రమం ఒక నిదర్శనమని చంద్రబాబు అన్నారు. చేనేత కుటుంబాలకు ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని, ఈ పథకం ద్వారా చేనేత కుటుంబాలకు ప్రత్యక్ష ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. చేనేత రంగ పునరుజ్జీవనానికి ఇలాంటి పథకాలు కీలకపాత్ర పోషిస్తాయని సీఎం అభిప్రాయపడ్డారు.
సొంత మగ్గం ఉంటే దరఖాస్తు చేసుకోవాలన్న సీఎం చంద్రబాబు
సొంత మగ్గం ఉన్న కుటుంబాలకు మాత్రమే ఈ సాయం వర్తిస్తుంది కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తులు చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. అనంతరం సీఎం చంద్రబాబు జాండ్రపేట లోని చేనేత వర్క్ షాప్ లో సందర్శించి, అక్కడ చేనేత వస్త్రాల తయారీ స్వయంగా పరిశీలించి కార్మికులతో మాట్లాడి వారి అవసరాలు, సమస్యలు తెలుసుకున్నారు.



Click it and Unblock the Notifications