వైసీపీలో తెరపైకి మాజీ ఎంపీ పేరు? నియోజకవర్గం ఖరారు??
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న లావు శ్రీకృష్ణదేవరాయలు కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారంటూ వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో నరసరావుపేట, వినుకొండ, గురజాల, మాచర్ల, పెదకూరపాడు, చిలకలూరిపేట, సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వీరిలో పలువురు ఎమ్మెల్యేలతో ఎంపీకి పొసగడంలేదనేది బహిరంగ రహస్యం.

ఎంపీపై ఎమ్మెల్యే ఫిర్యాదు
కొద్దిరోజుల క్రితమే గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఎంపీపై అధినాయకత్వానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అభివృద్ధి కార్యక్రమాలకు పిలవడంలేదని, ప్రొటోకాల్ ప్రకారం కూడా ఆహ్వానం అందడంలేదని పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలిపినట్లు వార్తలు వచ్చాయి. చిలకలూరిపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న మంత్రి విడుదల రజని, వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుతో ఎంపీకి పొసగకపోవడంతో కార్యక్రమాలు కూడా ఎవరికి వారుగా నిర్వహించుకుంటున్నారు. ఒకరి కార్యక్రమానికి మరొకరు హాజరవడం అరుదుగా మారింది.

రోజురోజుకు పెరుగుతున్న అంతరం
తన నియోజకవర్గ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలతో రోజురోజుకు అంతరం పెరుగుతుండటంతోపాటు అధినాయకత్వం దగ్గర తన మాట చెల్లుబాటు కావడంలేదనే అసహనం లావులో వ్యక్తమవుతోందని ఆయన సన్నిహితులు వెల్లడిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో శ్రీకృష్ణదేవరాయలు నరసరావుపేట లోకసభ స్థానం నుంచి మరోమారు అధికార పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తారా? లేదా? అనేది రాజకీయవర్గాల్లో ఉత్కంఠగా మారింది. అయితే ఆయన ఏనాడూ తన అసంతృప్తిని బహిర్గతం చేయలేదు.

తెరపైకి మాజీ ఎంపీ
అధికార పార్టీ తరఫున రానున్న ఎన్నికల్లో నరసరావుపేట నుంచి మరో మాజీ ఎంపీ పోటీచేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. గతంలో ఆయన ఎంపీగా గెలుపొందారు. రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంటులో దూకుడుగా వ్యవహరించి దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు. ఒకవేళ కృష్ణదేవరాయలు అనాసక్తిగా ఉంటే మరో ఎంపీని వెతుక్కోవడం కూడా చివరి నిముషంలో కష్టమవుతుందని భావించే ఈ మాజీ ఎంపీ తాను పోటీకి సిద్ధమని అధిష్టానానికి చెప్పినట్లు సమాచారం. అయితే అక్కడి పరిస్థితులనుబట్టే అధిష్టానం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. అప్పటివరకు వేచిచూడక తప్పదు.












Click it and Unblock the Notifications