బీ అలర్ట్ - ఒమిక్రాన్ కొత్త వేరియంట్ కేసులు, లక్షణాలివే..!!
కరోనా కేసులు దేశ వ్యాప్తంగా పెరుగుతున్నాయి. ఇదే సమయంలో ఏపీలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ కు చెందిన ఎక్స్ బీబీ 1.16 (అర్ట్యురుస్) కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో గురువారం నుంచి శుక్రవారం వరకు 44, శనివారం ఉదయం వరకు 14 చొప్పున రాష్ట్రంలో కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో 144 క్రియాశీలక కేసులున్నాయి. పది మంది బాధితులు అస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొత్తగా ఇన్ఫెక్షన్ తో ఆస్పత్రిలో చేరిన వారిలో జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి.

జ్వరం రెండు రోజుల్లో తగ్గిపోయాక దగ్గు, జలుబు వస్తుంది. చిన్న వయసు వారికి కళ్ల్లో ఎరుపుదనం కనిపిస్తోంది. దీనిని పూర్తి స్థాయిలో నిర్దారించేందుకు సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. గతంలో వచ్చినట్లుగానే గొంతునొప్పి, ఒంటి నొప్పులు పెద్దగా లేవని వెల్లడించారు.
ఇదే సమయంలో కేంద్రం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ఏపీలోనూ కరోనా పరీక్షల సంఖ్య పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి కరోనా కేసులు..సంసిద్దత పైన ఉన్నత స్థాయి సమీక్ష చేసారు.
రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల పరీక్షలు చేసేలా సిద్దంగా ఉండాలని సూచించారు. కేంద్రం సూచనల మేరకు అన్ని జిల్లాల్లోనూ ఈ నెల 10,11 తేదీలలో కరోనా మాక్ డ్రిల్ చేయాలని నిర్ణయించారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే ఈ కొత్త వేరియంట్ లక్షణాలను గుర్తించారు.
ఇప్పటివరకు వచ్చిన కరోనా వేరియంట్లతో పోలిస్తే ఈ వేరియంట్ మరింత వేగంగా వ్యాప్తి చెందుతుందని ప్రస్తుతం అది ప్రమాదకరంగా కనిపించనప్పటికీ, మళ్లీ అది రూపాంతరం చెంది బలపడే అవకాశం కూడా లేకపోలేదని వైద్య నిపుణులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications