అసలేం జరిగింది, ఎవరా మహిళ?: బెజవాడ పసికందు కిడ్నాప్ కేసులో కొత్త ట్విస్ట్

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో కిడ్నాప్‌కు గురైన ఆరు రోజుల పసికందు కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. 'మాయమైన బేబీతో మహిళ' అంటూ విజయవాడ పోలీసులు ఓ ఫోటోతో కరపత్రాలను ముద్రించి రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లలో అతికించిన సంగతి తెలిసిందే.

దీంతో పోలీసులు ముద్రించిన కరపత్రాల్లో ఉన్న మహిళ శుక్రవారం ఓ టీవీ ఛానెల్‌ను ఆశ్రయించారు. పోలీసులు విడుదల చేసిన కరపత్రాల్లో తన ఫోటో ముద్రించారని గుంటూరుకు చెందిన ధాన్యశబరి అనే మహిళ మీడియా ముందుకు వచ్చి పోలీసులపై పరువు నష్టం దావా వేసేందుకు సిద్ధమని ఆవేశంతో ఊగిపోయారు.

సీసీ కెమెరాల్లో కనిపించామన్న ఒకే ఒక్క కారణంతో తమ కుటుంబం ఫోటోలను అనుమానితులంటూ పోస్టర్లలో వేసి తమ పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించడమే కాకుండా, తమను మానసిక వేదనకు గురి చేశారని ఆమె ఆరోపించారు. తనకు ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదని ఆవిడ అన్నారు.

New twist in vijayawada govt hospital baby kidnap case

తన బిడ్డ ఐదు నెలల బిడ్డ అని, ఫిబ్రవరి 24న గుంటూరులో హెల్ప్ ఆసుపత్రిలో జన్మనిచ్చానని ఆమె చెప్పారు. ఈ బిడ్డ తనదేనని నిరూపించేందుకు డీఎన్ఏ పరీక్షలకైనా సిద్ధమని ఆమె సవాల్ విసిరారు. మీడియా ఎదుటే తన బిడ్డకు సంబంధించిన పూర్తి రికార్డులను చూపించారు.

ఈ కేసులో తమను దోషులుగా చూపించి సమాజంలో తలెత్తుకోనీయకుండా చేశారని పోలీసులపై ఆమె మండిపడ్డారు. గురువారం నుంచి తమ కుటుంబంపై టీవీలలో ఆరోపణలు చేశారని, ఆ సమయంలో తాము ఊరు వెళ్లడమే తప్పా? అని ఆమె ప్రశ్నించారు. అంటే ప్రజలెవరూ పనులు చేసుకోకూడదా? ఎక్కడికీ వెళ్ల కూడదా? అంటూ ఆమె నిలదీశారు.

అనుమానం వస్తే నిర్ధారణ చేసుకోకుండా పోస్టర్లు వేస్తారా? అంటూ ఆమె ప్రశ్నించారు. ఆసుపత్రిలో సీసీ కెమెరాలు పెట్టారు కదా? ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడికి వెళ్లారు? వంటి వివరాలు తెలుసుకోరా? అని ఆమె పోలీసును నిలదీశారు. తనకు జరిగిన పరువు నష్టానికి, మానసిక క్షోభకు న్యాయం చేయాలని అన్నారు.

పోలీసులు ఏం చెప్తున్నారు?

మరోవైపు పోలీసులు కరపత్రాల్లో ముద్రించిన మహిళ, మీడియా ముందుకొచ్చిన మహిళ ఒకరు కాదని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. తాము గురువారం విడుదల చేసిన ఫోటోల్లోని మ‌హిళలు శుక్రవారం గుంటూరు పోలీసుల‌ని ఆశ్ర‌యించిన మ‌హిళలు ఒక్క‌టి కాద‌ని విజ‌య‌వాడ‌ పోలీసులు చెప్పారు.

త‌మ‌కూ కిడ్నాప్‌కి ఎటువంటి సంబంధం లేద‌ని ప‌లువురు గుంటూరు మ‌హిళ‌లు పోలీసులని ఆశ్ర‌యించార‌ని, మీడియా ముందుకు వ‌చ్చార‌ని పోలీసులు అన్నారు. అయితే వారు ఏ ఉద్దేశంతో ఉన్నారో త‌మ‌కి తెలియ‌ద‌ని పోలీసులు పేర్కొన్నారు. వారు చేస్తోన్న వాద‌న‌ల‌తో పోలీసులు విభేదిస్తున్నారు.

గురువారం విడుద‌ల చేసిన చిత్రాల‌కు తాము క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని, ఆ చిత్రాల్లోని మ‌హిళ‌లే బాబుని కిడ్నాప్ చేసి ఉంటార‌ని పోలీసులు చెప్పడం విశేషం. కరపత్రాల్లో ఉన్న మహిళ మీడియా ఎదుట ఆగ్రహావేశంతో ఊగిపోవడంతో కిడ్నాప్‌కు గురైన శిశువు తల్లిదండ్రులు వివరణ ఇచ్చారు.

కిడ్నాప్‌కు గురైన పసికందు తల్లిదండ్రులు ఏమన్నారు?

సీసీటీవీ పుటేజిలో కనిపించిన ఆమె బిడ్డను తమ బిడ్డ అనడం లేదని, అదే సమయంలో బస్టాండ్‌లో కనిపించడంతో అనుమానం తలెత్తిందని చెప్పారు. పోలీసులు కూడా అనుమానితులనే పేర్కొన్నారే తప్ప, దొంగలు అనలేదని చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో ఆమె మరింత ఆగ్రహానికి గురయ్యారు.

మరోవైపు కిడ్నాప్‌కు గురైన పసికందు త‌ల్లిదండ్రులు, బంధువులు ఆందోళ‌న కొన‌సాగిస్తున్నారు. పసికందు ఆచూకీ ఇంకా ల‌భించ‌క‌పోవ‌డంతో త‌మ శిశువుని త‌మ‌కు అప్ప‌గించే వ‌ర‌కు ఆసుప‌త్రి ముందు నుంచి క‌ద‌ల‌బోమ‌ని వారు తేల్చిచెప్పారు. సీసీటీవీ పుటేజీలో ఉన్న మహిళ, మీడియా ముందుకొచ్చిన మహిళ ఒకరు కాదని చెప్పారు.

తమ శిశువు ఆచూకీ కనిపెట్టేందుకు పోలీసులకు కొంత సమయం ఇచ్చామని, అలా జరగని పక్షంలో తమ శిశువు ఆచూకీ ఎలా తెలుసుకోవాలో తమకు తెలుసుని గట్టిగా చెబుతున్నారు. ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ వేగవంతంగా లేదని వారు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే శిశువు కిడ్నాప్ అయిన నేపథ్యంలో ఆసుప‌త్రి వ‌ద్ద ఎటువంటి ఉద్రిక్త ప‌రిస్థితులు చెల‌రేగ‌కుండా అధికారులు అక్క‌డ‌ పోలీసు బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. చిన్నారి కిడ్నాప్ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు సైతం స్పందించిన సంగతి తెలిసిందే.

రష్యా పర్యటనలో ఉన్న సీఎం గురువారం అక్కడి నుంచి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సిబ్బంది అలసత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, చిన్నారిని వెతికేందుకు చేపట్టిన చర్యలను అడిగి తెలుసుకున్నారు. తక్షణం చిన్నారి ఆచూకీ తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు.

అసలేం జరిగింది?
కొత్తపేటకు చందిన సుబ్రహ్మమ్యం, కళ్యాణి దంపతులు వారం రోజుల క్రితం జన్మించిన తమ కుమారుడికి కామెర్లు సోకడంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలోని నవజాతు శిశు చికిత్సా కేంద్రంలో చేర్పించారు. చికిత్స పొందుతున్న శిశువును నాలుగు రోజులుగా ఇంక్యుబేటర్లో ఉంచారు.

అయితే, గురువారం ఉదయం ఆ శిశువును ఎవరో ఎత్తుకుపోయారు. దీని పైన అక్కడి సిబ్బందిని అడిగితే నోరు మెదపడం లేదని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుర్తు తెలియని మహిళ చిన్నారని తీసుకు వెళ్లిందని కొందరు చెబుతున్నారు. ఆసుపత్రిలో సిసి కెమెరాలు కూడా లేకపోవడంతో ఎవరు తీసుకెళ్లారనే విషయం తెలియడం లేదు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
New twist in vijayawada govt hospital baby kidnap case.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి