మళ్లీ కరోనా విజృంభణ: ఈ సారి చిత్తూరు జిల్లాపై పంజా: రెండు వేల మార్క్‌కు చేరువగా
అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత మరోసారి పెరుగుదల బాట పట్టింది. కొద్దిగా గ్యాప్ తరువాత.. మరోసారి కరోనా వైరస్ విజృంభించడం ఆరంభించింది. ఫలితంగా ఇప్పటిదాకా రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య రెండువేల మార్క్‌ను అందుకునే దిశగా దూసుకెళ్తోంది. అదే సమయంలో కరోనా కోరల నుంచి బయటపడిన వారు కూడా పెద్ద సంఖ్యలో నమోదవుతున్నారు. ఇప్పటిదాకా డిశ్చార్జి అయిన వారు వెయ్యికి చేరువ అవుతున్నారు.
రాష్ట్రంలో కొత్తగా 50 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ సారి చిత్తూరు జిల్లాపై పంజా విసిరింది కరోనా వైరస్. ఈ జిల్లాలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 16 కేసులు వెలుగులోకి వచ్చాయి. దీనితో ఈ జిల్లాలో ఇప్పటిదాకా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య వంద మార్క్‌ను అధిగమించింది. 112కు చేరుకుంది. అదే సమయంలో- 74 మంది డిశ్చార్జి అయ్యారు. ఫలితంగా- యాక్టివ్‌గా ఉన్న కేసుల సంఖ్య 38 వద్ద నిలిచిపోయింది.. ప్రస్తుతానికి. ఇప్పటిదాకా ఈ జిల్లాలో కరోనా వల్ల ఒక్కరు కూడా మరణించలేదు.

24 గంటల వ్యవధిలో నమోదైన కేసుల్లో చిత్తూరు తరువాత.. కర్నూలు రెండో స్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో మొత్తం 13 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 566కు చేరగా.. ఇందులో 239 మంది ఇప్పటికే డిశ్చార్జి అయ్యారు. యాక్టివ్ కేసులు 311. కాగా.. కొత్తగా గుంటూరులో ఆరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో అయిదు చొప్పున పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ప్రకాశం జిల్లాలో రెండు, విశాఖపట్నం, కడప, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్క కేసు వెలుగులోకి వచ్చాయి.
మొత్తం 1980 కేసులు నమోదు కాగా.. అందులో 1010 యాక్టివ్‌గా ఉన్నట్లు వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు జారీ చేసిన బులెటిన్‌లో వెల్లడించారు. 925 మంది డిశ్చార్జి అయ్యారని, 45 మంది మరణించారని తెలిపారు. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 239 మంది ఇప్పటిదాకా డిశ్చార్జి అయ్యారు. గుంటూరు-176, కృష్ణా-137, చిత్తూరు-74, నెల్లూరు-62, ప్రకాశం-60, అనంతపురం-45, కడప-43, పశ్చిమ గోదావరి-33, తూర్పు గోదావరి-31, విశాఖపట్నం-25 మంది డిశ్చార్జి అయ్యారు.












Click it and Unblock the Notifications