ఏపీలో మరో మూడు రోజులపాటు వానలు: ఆ జిల్లాల్లో అతి భారీ వర్షాలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరికొద్ది రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. నైరుతి బంగాళాఖాతంలో బుధవారం ఏర్పడిన అల్పపీడనం సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనంతో కొనసాగుతోందన్నారు.
ఈ అల్పపీడనం వచ్చే 24 గంటల్లో మరింతగా బలపడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం నవంబర్ 12న ఉదయం నాటికి వాయువ్య దిశగా కదిలి వాయుగుండంగా తమిళనాడు-పుదుచ్చేరి తీరాన్ని తాకనుందని వెల్లడించింది.

అల్పపీడనం ప్రభావం దృష్ట్యా నవంబర్ 11 నుంచి 13 వరకు ఏపీలోని దక్షిణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నవంబర్ 11 నుంచి 11 వరకు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
మరోవైపు, అన్నమయ్య, చిత్తూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. సత్యసాయి అనంతపురం, నంద్యాల జిల్లాల్లో జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణంలో స్థిరంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, ఒంగోలులోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.












Click it and Unblock the Notifications