మళ్లీ అడుగు పెడుతున్న నిమ్మగడ్డ (మ్యాట్రిక్స్) ప్రసాద్
నిమ్మగడ్డ ప్రసాద్.. అనే పేరుకన్నా మ్యాట్రిక్స్ ప్రసాద్ గానే ఆయన చిరపరిచితుడు. 2006లో మ్యాట్రిక్స్ లేబొరేటరీస్ ను అమెరికాకు చెందిన ఫార్మా దిగ్గజం మైలాన్ ల్యాబ్స్ కు విక్రయించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన వివిధ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టారు కానీ ఫార్మావైపు దృష్టిపెట్టలేదు. అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత నిమ్మగడ్డ ప్రసాద్ అలియాస్ మ్యాట్రిక్స్ ప్రసాద్ ఫార్మా రంగంలోకి అడుగుపెట్టబోతున్నారు.
వియాట్రిస్ నుంచి
నిమ్మగడ్డ కుటుంబానికి చెందిన ఐక్వెస్ట్ ఎంటర్ ప్రైజెస్, అమెరికాలోని దిగ్గజ సంస్థ అయిన వియాట్రిస్ కు మనదేశంలో ఉన్న ఔషధ వ్యాపారంతోపాటు యూనిట్లను కొనుగోలు చేసే ఒప్పందం కుదుర్చుకుంది. గ్లోబల్ కాంపిటీటివ్ బిడ్ లో వియాట్రిస్ కు సంబంధించిన ఇండియా వ్యాపార కార్యకలాపాలు, ఆస్తులను కొనుగోలు చేసే అవకాశం దక్కినట్లు ఐక్వెస్ట్ ఒక ప్రకటనలో వెల్లడించింది.

అటు తిరిగి.. ఇటు తిరిగి
వియాట్రిస్ సంస్థకు భారత్ లో ఆరు ఫార్మా యూనిట్లు ఉన్నాయి. మూడు హైదరాబాద్ లో, మూడు వైజాగ్ లో ఉన్నాయి. హైదరాబాద్ లో ఆర్ అండ్ డీ కేంద్రం, ఏపీఐ థర్డ్ పార్టీ విక్రయాలకు సంబంధించిన విభాగం కూడా ఉంది. ఇవన్నీ గతంలో మ్యాట్రిక్స్ కు సంబంధించినవే కావడం విశేషం. మ్యాట్రిక్స్ ను మైలాన్ ల్యాబ్స్ కొనుగోలు చేసింది. ఆ తర్వాత మైలాన్ మరో సంస్థలో విలీనమై వయాట్రిస్ గా మారింది. మ్యాట్రిక్స్ యూనిట్లే అటు తిరిగి ఇటు తిరిగి నిమ్మగడ్డకు చెందిన ఐక్వెస్ట్ ఎంటర్ ప్రైజెస్ చేతికి వస్తున్నాయి.
సొంతింటికి వచ్చినట్లుంది
తిరిగి తాము ఫార్మా రంగంలోకి అడుగు పెడుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని నిమ్మగడ్డ ప్రసాద్ కుమార్తె, ఐక్వెస్ట్ ఎంటర్ ప్రైజెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గునుపాటి స్వాతిరెడ్డి వ్యాఖ్యానించారు. ఫార్మా రంగంలో అతి పెద్ద పెట్టుబడుల్లో ఇది ఒకటవుతుందన్నారు. సొంత ఇంటికి తిరిగివచ్చినట్లుందన్నారు. భారత్ లో ఏపీఐ వ్యాపారంతోపాటు ఉమెన్స్ హెల్త్ కేర్ వ్యాపారం కూడా కలిపి 1.2 బిలియన్ డాలర్లకు (రూ.10వేల కోట్లు)విలువ కట్టి ఐక్వెస్ట్, ఇన్సడ్ ఫార్మాకు వియాట్రిస్ విక్రయించింది. వచ్చే ఆరు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తికానుంది. వియాట్రిస్ ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న వ్యాపారాలను విక్రయించడానికి ప్రయత్నిస్తోంది.












Click it and Unblock the Notifications