అవిశ్వాస తీర్మానం: స్పీకర్ వైఖరి బాధాకరం: జేసీ, ఇదో చారిత్రక తప్పిదం: జీవీఎల్
న్యూఢిల్లీ: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మాన విషయంలో లోకసభ స్పీకర్ సుమిత్రా మహజన్ వైఖరిని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తప్పుపట్టారు. నిబంధనలంటే లెక్కలేని రీతిలో కేంద్ర ప్రభుత్వం, స్పీకర్ వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
స్పీకర్ సుమిత్రా మహజన్ సభను నిర్వర్తించిన తీరుపై జేసీ దివాకర్ రెడ్డి ఆవేదన వెలిబుచ్చారు. సంతకాలు చేసి అవిశ్వాస తీర్మానం ఇస్తే కనీసం పరిగణలోనికి తీసుకోలేదని తెలిపారు. పార్లమెంట్ చరిత్రలోనే ఇది బ్లాక్‌డే అని ఆయన అభివర్ణించారు.

మరోవైపు ఇదే అంశంపై కేంద్రంపై బీజేపీ నేత జీవీఎల్ నరసింహరావు మాట్లాడుతూ టీడీపీ తీరుపై విమర్శలు గుప్పించారు. టీడీపీ అవిశ్వాస తీర్మానం తీసుకురావడం చరిత్రక తప్పిదంగా ఆయన అభివర్ణించారు. ఓటమి బాటలో ఉన్న పార్టీలతో జతకట్టిన చంద్రబాబుకు పరాజయం తప్పదని ఆయన జోస్యం చెప్పారు.
కేంద్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడమే టీడీపీ లక్ష్యమని విమర్శించారు. కనీస బలం లేని ఇతర పార్టీలతో కలిసి అవిశ్వాసాన్ని ఎలా నెగ్గించుకుంటారని ముఖ్యమంత్రి చంద్రబాబును ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు తీరు చూస్తుంటే శునకం తోక పట్టుకుని గోదావరి ఈదినట్టుందని జీవీఎల్ నరసింహారావు దుయ్యబట్టారు.












Click it and Unblock the Notifications