హైదరాబాదీలే, కాలర్ ఎగురేసుకుని తిరగండి: సెటిలర్ పదంపై కెసిఆర్
హైదరాబాద్: సెటిలర్ అనే పదంపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మరోసారి ప్రతిస్పందించారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ సెటిలర్స్ అనే పదం వాడవద్దని, వారంతా హైదరాబాదీలని ఆయన అన్నారు. ప్రాంతీయ భేదాలు మరిచి మేం హైదరాబాదీలమని కాలరేగురేసుకుని తిరగండి, మీ వెంట కెసిఆర్ ఉన్నాడని ముఖ్యమంత్రి శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ముంబైలో 95 శాతం మంది ఇతర ప్రాంతాలవారేనని, వారంతా తాము ముంబైవాళ్లమని చెప్పుకుంటారని ఆయన అన్నారు. హైదరాబాదులో నివసించేవారు తాము హైదరాబాదీలమని గర్వంగా చెప్పుకోవాలని, అలా చెప్పుకోవడానికి హైదరాబాద్ అనే గొప్ప నగరం ఉందని ఆయన అన్నారు.
ప్రాణహిత చేవెళ్ల డిజైన్ బాగా లేదని, అనవసరంగా మహారాష్ట్రతో గొడవ పెట్టుకోవడం సరి కాదని, దాని డిజైన్ మారుస్తామని, అందుకు చర్యలు తీసుకుంటున్నామని కెసిఆర్ చెప్పారు. కర్ణాటకలోని ఆల్మట్టి నుంచి కూడా తాము నీళ్లు తెచ్చుకుంటామని, అందుకు కర్ణాటక ఉదారంగా ముందుకు వచ్చిందని ఆయన అన్నారు. ఆల్మట్టి ఎత్తు పెంచి 300 టిఎంసిలు నిలువ చేస్తోందని, ఆ రాష్ట్రానికి 196 టిఎంసిల కేటాయింపు ఉందని ఆయన చెప్పారు.

దాంతో ఆల్మట్టి, నారాయణపూర్‌ల మీదుగా గ్రావిటీ ద్వారా మహబూబ్‌నగర్ జల్లాలో నీటిని వాడుకోవడానికి విడుదల చేస్తామని కర్ణాటక చెప్పిందని, దీనిపై కర్ణాటక సిఎంతో మాట్లాడడానికి తాను బెంగళూరు వెళ్తానని, అసెంబ్లీ సమావేశాల సమయంలోనైనా సరే, అది ముఖ్యం కాబట్టి వెళ్తానని ఆయన అన్నారు. ఆల్మట్టి నుంచి నీళ్లు తెచ్చుకుంటామని కెసిఆర్ చెప్పారు.
హుస్సేన్ సాగర్ ప్రక్షాళణపై వస్తున్న విమర్శలను ఆయన కొట్టి పారేశారు. ఇంకా బూజు పట్టిన ఆలోచనలే ఉండాలా అని ఆయన అడిగారు. నగరం లోపల అంత పెద్ద చెరువు ఉందని చెబుతూ రసాయనాలతో, మురుగుతో అలాగే ఉండనివ్వాలా అని ఆయన అడిగారు. ఈ విమర్శలను జర్నలిస్టులు కూడా ఖండించాలని ఆయన అన్నారు. హైకోర్టు విభజనకు ఇంకా ఆదేశాలు రాలేదని ఆయన ఒ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.












Click it and Unblock the Notifications